ఆహారంరాష్ట్రీయంస్థానికం

ప్రథమ్ ‌యాప్‌ ద్వారా 20 నుంచి బస్సు టికెట్లు జారీ

విజయవాడ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల టికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రథమ్‌ అనే యాప్‌ను రూపొందించింది. ఈ నెల 20 నుంచి ప్రథమ్‌ యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్సుల టికెట్లను జారీ చేయనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత 19 డిపోల పరిధిలో యాప్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు.విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, విజయనగరం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రి డిపోల్లో ప్రథమ్‌ యాప్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తారు. కరోనా వ్యాపించకుండా కండెక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్‌ సమకూర్చుకోవాలని ఆదేశించారు. సూచించిన ప్రమాణాల మేరకు స్మార్ట్‌ ఫోన్లు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి యాప్‌ సహా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అందిస్తామని ఎండీ తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈడీలు, ఆర్‌ఎంలకు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఆదేశించారు.