న్యూస్ప్రాంతీయంరాజకీయంవిశాఖపట్నంస్థానికం

కార్యకర్తలను గ్రామస్థాయి నుండి కార్యోన్ముఖులను చేయాల్సిన సమయం ఆసన్నమైంది

* రోలుగుంట మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు గండి సింహాద్రి

రోలుగుంట,కోస్తాటైమ్స్, (అక్టోబర్ -19) : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామస్థాయి నుండి ఎన్నికల యుద్ధానికి కార్యోనుముఖులను చేయాల్సిన సమయం ఆసన్నమైందని రోలుగుంట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గండి సింహాద్రి అన్నారు. ఆయన స్వగ్రామమైన కుసర్లపూడిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల నాటికంటే తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయిందని, అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకులు కరువయ్యారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత అనుకూలత చేకూర్చారన్నారు. తెలుగుదేశం చక్కని అనుకూల వాతావరణంలో ఇప్పుడు ఉందని ఇటువంటి వాతావరణం అనుకూలంగా మలుచుకోవడంలో నాయకులు శ్రమించడం లేదని, అందరూ అతి విశ్వాసంతో ఉన్నారన్నారు. కార్యకర్తల బలాన్ని వినియోగించుకోవడంలేదని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను గ్రామాలలో బలోపేతం చేయాలని, కార్యకర్తకు గ్రామంలో భరోసా కావాలని, అప్పుడు ఒక కార్యకర్త 20 మందిని తయారు చేస్తారన్నారు. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బాధ్యుడిని ఏర్పాటు చేసి బాధ్యత అప్పగించాలన్నారు. ప్రతి మండలాన్ని ఐదు భాగాలు చేసి ఒక్కో భాగంలోని పంచాయతీల కార్యకర్తలను సమావేశపరిచి ప్రోత్సహించి, ఈ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఫోటోలకు పరిమితం కాకుండా కార్యక్రమాన్ని నాయకులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి రాకపోతే కార్యకర్తల బలం నిర్వీర్యమైపోతుందన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో, కొంతమంది నాయకులు కేసులకు భయపడుతున్నారని, కార్యకర్తకు ఆ భయం లేదని, దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, అటువంటి కార్యకర్తలను బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, పంచాయతీ ఎన్నికలలో కార్యకర్తలకు గ్రామాలలో ఏవిధంగా సన్నద్ధం చేస్తారో, ఆ విధంగా కార్యకర్తలను ప్రతి గ్రామం నుండి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గండి తాతాజీ, గొల్లు కన్నబాబు, గొల్లు అప్పలనాయుడు,పాల కేంద్రం అధ్యక్షుడు కేతిరెడ్డి జోగి నాయుడు, పెంటకోట అప్పారావు, తమరాన వెంకటరావు, రొంగలి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.