తెలంగాణ

13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు కేసీఆర్ శంకుస్థాప‌న‌

నల్గొండ, ఫిబ్రవరి 10 (న్యూస్‌టైమ్): నాగార్జున సాగర్‌ నియోజకర్గం పర్యటనలో భాగంగా నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు జి. జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ర‌వీంద్ర నాయ‌క్‌తో పాలు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు.

పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ఆరున్నరేళ్ల కిందట రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే కనాకష్టంగా ఉండేది. కానీ ఇవ్వాళ 13.63లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క యాసంగిలోనే మనం సేకరించగలిగాం. ఇదికాక పండించిన ధాన్యంలో మరో 50శాతం అవసరాల కోసం ప్రజల వద్ద ఉన్నది. ఇలా ఉమ్మడి జిల్లాలో చెప్పుకోవడానికి అనేకం ఉన్నాయి. గోదావరి జలాల తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు చేరింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూములు సస్యశ్యామలం అయ్యాయి. బస్వాపురం ద్వారా భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లోనూ గోదావరి జలాలు పారనున్నాయి.’’ అని పేర్కొన్నారు.

‘‘కృష్ణానది జలాల్లో ఎడమకాల్వకు నీటి హక్కులు ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు. మన నీళ్లు వాళ్లు దోచుకుపోయి మన భూములను బీళ్లుగా మార్చారు. ఎడమకాల్వపై తొలి మేజర్‌ రాజవరంలోనూ ఎన్నడూ చివరి వరకు నీరు పారింది లేదు. కానీ ప్రత్యేక శ్రద్ధతో చివరి ఎకరా వరకు నీళ్లిచ్చి చరిత్రను తిరగరాశాం. రాష్ట్ర ఏర్పాటు నుంచి కృష్ణానదిలో నీటివాటాను నిక్కచ్చిగా వాడుకుంటున్నాం. చివరి భూములను, నది వెంట ఉన్న ప్రాంతాలను గాలికి వదిలేశారు. వాటిల్లో నీటిని పారించేందుకే కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నాం.. రానున్న కాలంలో ఎడమకాల్వకు, కృష్ణానదికి మధ్య ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరివ్వడమే లక్ష్యంగా పనిచేస్తాం. కరువు ప్రాంతాలుగా ముద్రపడ్డ దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు డిండి ఎత్తిపోతల పనులు కొనసాగుతున్నాయి. ఇక ఎవరూ ఊహించని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌, మూడు మెడికల్‌ కాలేజీలు వచ్చాయి.’’ అని తెలిపారు.

‘‘చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ నల్లా, 24గంటల ఉచిత విద్యుత్‌ ఇలా ఎన్నో పథకాలతో రాష్ట్రంలోనే అత్యధిక లబ్ధిపొందిన జిల్లా ఉమ్మడి నల్లగొండనే. తాజాగా రూ.మూడువేల కోట్లతో 13 లిఫ్టు పథకాలు కూడా మంజూరు చేశాము. మూసీ జలాలకు తోడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సూర్యాపేట జిల్లాకు గోదావరి నీళ్లొచ్చాయి. రికార్డు స్థాయిలో పెరిగిన సాగు విస్తీర్ణం ఫలితంగా ధాన్యం దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రైతుబంధు, రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు కొండంత ఆసరా అయ్యింది. వీటికి తోడు మిషన్‌ భగీరథ జలాలతో ఫ్లోరైడ్‌ రక్కసిని తరిమికొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందుకున్నాం.. విద్యాపరంగా ఉమ్మడి జిల్లాకు మెడికల్‌ కళాశాలలు మంజూరయ్యాయి. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా యాదాద్రి టెంపుల్‌, థర్మల్‌ ప్లాంటు నిర్మాణం జరుగుతున్నాయి.’’ అని సీఎం అన్నారు.

‘‘సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జిల్లాల్లో నల్లగొండ ఒకటి. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధిక లబ్ధి పొందిన జిల్లా కూడా నల్లగొండనే. వ్యవసాయంలో అనేక పథకాల ద్వారా జిల్లా రైతాంగానికి వేల కోట్ల రూపాయల లబ్ధి కలిగింది. గోదావరి జలాల రాకతో సూర్యాపేట జిల్లా రైతాంగం కల నెరవేరింది. బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి. కృష్ణానదీ జలాల్లో మన వాటాను వాడుకోవడంలో రాజీ లేదు. దీంతో సమృద్ధిగా నీటిని ఇవ్వగలుగుతున్నాం. చివరి భూములకు నీరందించే ప్రయత్నాల్లో సక్సెస్‌ అవుతున్నాం. ఇంకా ఎడమకాల్వ, కృష్ణానదీ మధ్య ప్రాంతంలో మిగిలి ఉన్న బీడుభూములకు ఎత్తిపోతలే మార్గంగా కనిపిస్తున్నది. డిండి ఎత్తిపోతలను కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము. వీటితో పాటు వేల కోట్ల రూపాయలతో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. ఉమ్మడి జిల్లాలో కృష్ణా జలాలకు గోదావరి జలాలు తోడయ్యాయి. కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఆరున్నరేండ్లలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ నుంచి 13.63లక్షలకు చేరుకోవడమే అందుకు నిదర్శనం. గత యాసంగి, వానకాలం కలిపి రూ.3946కోట్ల విలువైన 21.29లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి చరిత్ర సృష్టించాం. ఒక్క జిల్లాలోనే ఇంత ధాన్యం సేకరణ అనేది దేశంలోనే అత్యధికం. ఇక రైతుబంధు ద్వారా ఆరు విడుతల్లో రూ.5853కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. రుణమాఫీ ద్వారా 5.66లక్షల మంది రైతులకు రూ.2382కోట్ల లబ్ధి చేకూరింది. గతంలో రైతు చనిపోతే దిక్కుండేది కాదు.’’ అని కేసీఆర్ తెలిపారు.

‘‘కానీ నేడు కారణం ఏదైనా రైతుబీమా ద్వారా ఐదు లక్షల తక్షణ సాయం ఆ కుటుంబాన్ని నిలబెట్టేందుకు తోడ్పడుతుంది. ఇప్పటివరకు 5849 మంది రైతు కుటుంబాలకు 292.45కోట్ల బీమా సొమ్ము అందింది. ఇక మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగింది. బస్వాపురం ద్వారా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు వచ్చే వానకాలం నాటికి గోదావరి జలాలు అందనున్నాయి. రానున్నకాలంలో డిండి ఎత్తిపోతల కూడా పూర్తయితే ఉమ్మడి జిల్లా నలుమూలలా సస్యశ్యామలం అయినట్లే. కచ్చితంగా అలానే భావించాలి. ఉద్యమకాలంలో ఎడమకాల్వ ఆయకట్టుకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశాం. అందులో భాగమే 2003 ఆగస్టులో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపట్టాము. ఈ పాదయాత్రలో ఆయకట్టు రైతుల గోసను స్వయంగా విన్నాను.’’ అని వివరించారు.

‘‘నీటివాటాను వాడుకోవడంలో నిర్లక్ష్యం, కాల్వల డిజైనింగ్‌లో లోపాలు, ఎగువప్రాంతాలకు నీరు పారని దుస్థితి, మరమ్మతుకు నోచని మేజర్లు, కాల్వలు, లక్ష ఎకరాలకు సంబంధించిన లిఫ్టులపై నిర్లక్ష్యం… ఇలా సమైక్యపాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. ఎడమకాల్వ పరిధిలో జిల్లాలో పేరుకు మూడు లక్షల ఆయకట్టు అని చెప్పినా ఎన్నడూ సగానికి మించి సాగునీరు పారలేదు. ఆయకట్టు సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న వాటిల్లో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాము. ఇప్పటికే నిక్కచ్చిగా నీటివాటాను వాడుకుంటున్నాం. రాజవరం లాంటి మేజర్‌లోనూ చివరి భూములకు తొలిసారిగా నీరిచ్చాం. ఆయకట్టులో మిగిలి ఉన్న బీడుభూములను సస్యశ్యామలం చేయడం లక్ష్యంగా నెల్లికల్లు నుంచి కోదాడ వరకు ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన జరిగింది. వాటిని త్వరలోనే పూర్తి చేసి దశాబ్దాల అన్యాయాలను సరిచేసేందుకు కంకణబద్దులుగా ఉన్నాము.’’ అని చెప్పారు.

‘‘సమైక్యపాలనలో జిల్లాలో ఫ్లోరైడ్‌భూతాన్ని పెంచిపోషించారు. దీనిపై ఉద్యమకాలంలో కేసీఆర్‌ స్యయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి చలించిపోయారు. దీంతో రాష్ట్ర సాధన అనంతరం మిషన్‌ భగీరథతో ఇంటింటికీ రక్షిత నీరు అందిస్తూ ఫ్లోరైడ్‌ను తరిమికొట్టగలిగాం. అందుకే నల్లగొండను ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా కేంద్రం ఇటీవలే ప్రకటించింది. కొత్తగా ఒక్క ఫ్లోరైడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ కనెక్షన్లు కలిగిన జిల్లాకు 24గంటల ఉచిత విద్యుత్‌తో అధిక ప్రయోజనం కలుగుతున్నది. రైతుబంధు, రుణమాఫీ ఇలా ఎందులో తీసుకున్నా అత్యధిక లబ్ధి ఉమ్మడి జిల్లాకే జరుగుతుంది. ఇక యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను ఎవ్వరూ ఊహించలేదు. దాని పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మూడు మెడికల్‌ కాలేజీలు మంజూరయ్యాయి. రాష్ర్టానికే తలమానికంగా యాదాద్రి టెంపుల్‌ రూపుదిద్దుకుంటుంది. మల్కాపూర్‌ వద్ద విశాలమైన గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎన్నో అద్భుత పథకాలు మా నాయకత్వంలో జిల్లాలో అమలవుతున్నాయి.’’ అని సీఎం తెలిపారు.