కొమరేపల్లిలో పరిస్థితి అదుపులోనే..
ఏలూరు, జనవరి 24 (న్యూస్‌టైమ్): పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొమిరేపల్లి ప్రాంతంలో వింత వ్యాధి బాధితులను ఆయన పరామర్శించారు. ఆ గ్రామంలో పర్యటించి బాధితుల ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో 108 వాహనాలను 7 అందుబాటులో ఉంచామని, 25 మంది ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 22 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని, వారికి వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. గ్రామంలో రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కొమిరేపల్లిలో 10 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్లను లాగారని, జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తుంటే దీని వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ల నాని భరోసా కల్పించారు.