స్థానికం

‘విశాఖ ఉక్కు’ను కాపాడుకుంటాం

విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అన్నారు. కేంద్రం తీసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ బాలచెరువు రోడ్‌ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన సభ చేపట్టారు. నిరసన సభకు వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అదే ఉద్యమస్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో ఉందని, విస్తరణ కారణంగా రుణాలు తీసుకోవడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్లాంట్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షత చూపిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖను స్ఫూర్తిగా తీసుకొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పర్యాటక శాఖ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రైతు ఉద్యమానికి మించిన ఉద్యమం కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంటే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమేనని బీజేపీ అనుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్‌లో కడప స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు కేటాయించలేదని.. ఏపీకి మొండిచేయి చూపించిందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయలేదు సరి కదా ఎందరికో ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన నేతలు ప్రజల ఆకాంక్షను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ ప్రజల అభిప్రాయం చెప్పినట్టేనన్నారు. పవన్‌కల్యాణ్‌, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎంపీల అవసరం లేదని కేంద్రం భావిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. తెలుగు ప్రజలకు నష్టం కలిగించిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

మరోవైపు, విశాఖ సర్క్యూట్ హౌస్‌లో స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ అంశంపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి (నాని), సీపీఎం విశాఖ నగర ప్రధాన కార్యదర్శి గంగరామ్, ఏపీ మహిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి విమల, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకర్రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణ రావు, ఐయన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, వై.మస్తానప్ప, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి అయోద్య రామ్ ఇంకా కార్మిక సంఘ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం దురదృష్టకరం. ఏకపక్షంగా నిర్ణయన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తోంది. ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైన సిద్ధం.’’ అని పేర్కొన్నారు.

‘‘13 జిల్లాలకు గుండె కాయ లాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్. రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు. అది శాశ్వతంగా ఆంధ్రులకే ఉండాలన్నది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంగా ప్రకటించటం అందరూ ఖండించాలి. ఉత్తరాంధ్ర ఉద్యమలకు ఏమి కొత్త కాదు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ ద్వారా ప్రధాని మోడీకి తెలిపారు. ఏపీలో పుట్టడమే మనం చేసిన తప్పా అనిపిస్తుంది. ఇది తెలుగు ప్రజల సెంటిమెంట్‌తో ముడి పడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సాధించుకోవటం అందరి హక్కు. ఎంపీగా ఉంటే ప్రధానిని కలవొచ్చు, ఉన్నతాధికారులను కల్వొచ్చు. కాబట్టి పదవిలో ఉండే పోరాడాలి. అన్ని పార్టీల వారిని నేనే స్వయంగా పిలిచాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు. రేపటి నుంచి దశల వారిగా ఉద్యమాలు చేద్దాం. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ పునరాలోచించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.’’ అని తెలిపారు.