రాజకీయం

మనసులో మాట బయటపెట్టిన ‘మెట్రో మ్యాన్’

త్రివేండ్రమ్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకనుగుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ‘లవ్ జీహాద్‌’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించేశారు.

మొత్తానికి కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2-3 నెలల్లో జరగాల్సి ఉండగా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 21వ తేదీన బీజేపీ తలపెట్టిన విజయ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. అప్పుడే తనను తాను అందుకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కూడా. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ప్రభుత్వం, వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు ప్రారంభించారు. తాజాగా ‘లవ్ జిహాద్‌’పై వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు.

‘లవ్ జిహాద్’ కారణంగా ఎంతోమంది అమాయక యువతులు బలైపోతున్నారని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ తెలిపారు. కేరళలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిదని ధ్వజమెత్తారు. కేరళ రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ పరిణామాల్ని గమనిస్తున్నానని, హిందూవుల్ని ఏ విధంగా బలవంతపు పెళ్లిళ్లతో బంధిస్తున్నారో తెలుసని, తరువాత ఎలాంటి బాధలు పడుతున్నారనేది పరిశీలిస్తున్నానని చెప్పారు శ్రీధరన్. కేవలం హిందూవులు మాత్రమే కాదు.. ముస్లింలు, క్రిస్టియన్లు సైతం అదే ఊబిలో చిక్కుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌‌ను ఓ నియంతగా అభివర్ణించిన శ్రీధరన్ పినరయి ముఖ్యమంత్రి పాలనకు పదికి 3 మార్కులు కూడా రావని వ్యాఖ్యానించారు. ఆయన అసలు ప్రజలతో మమేకమే కారని, ప్రజల్లో ఆయన పట్ల సదభిప్రాయం లేదన్నారు.

రాష్ట్రంలోని మంత్రులకు కూడా స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదని, అభిప్రాయాలు పంచుకుననే స్వాతంత్ర్యం వారికి లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తానని ముందుగానే సూత్రప్రాయంగా ప్రకటించిన ఆయన పార్టీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దమని మనసులో మాట బయటపెట్టేశారు.