అమరావతి, జనవరి 30 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు రాజకీయాలే కావాలనుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇవాళ వైయస్ఆర్ జిల్లా పర్యటటనకు నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లారా? రాజకీయాలకు వెళ్లారా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. తనపై, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నిమ్మగడ్డ రమేష్ గవర్నర్‌కు లేఖ రాశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రివిలెజ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
శనివారం విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తాను మూడుసార్లు కేబినెట్ మంత్రిగా, ఒకసారి ఎంపీగా పని చేశామని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎప్పుడు ప్రవర్తించలేదన్నారు. మా వ్యక్తిగత ప్రతిష్టను భంగపరిచేలా నిమ్మగడ్డ రమేష్ గవర్నర్‌కు లేఖ రాశారని, ఆ లేఖను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను బెదిరించినట్లుగా నిమ్మగడ్డ లేఖ రాశారని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ లక్ష్మణ రేఖ దాటారని చెప్పారు. ఎస్ఈసీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగుల ఆరోగ్యరీత్యా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఎస్ఈసీ జిల్లాల పర్యటనల్లో కూడా అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పని చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు.
గ్రామాల్లో కక్షలు ఉండకూడదనే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏకగ్రీవాలకు విరుద్ధంగా ఎస్ఈసీ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని తప్పుపట్టారు. అనంతపురం జిల్లాలో మీడియా అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ చీత్కరించుకుని వెళ్లారని తెలిపారు. ఇవాళ వైయస్ఆర్ జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ సీబీఐ కేసుల గురించి ఎందుకు మాట్లాడారో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాజకీయ ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యాఖ్యలున్నాయన్నారు. నిమ్మగడ్డకు వైయస్ఆర్ జిల్లాలో లక్ష్మణ రేఖ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి మొదటి నుంచి అలాగే ఉందన్నారు. ఆయనకు రాజకీయాలు కావాలనుకుంటే రాజీనామా చేసి బయటకు రావాలని హితవు పలికారు. నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణ కోసం జిల్లాల పర్యటనకు వెళ్తున్నారా? లేక రాజకీయాలకు వెళ్తున్నారా అని మండిపడ్డారు. గ్రామ స్వరాజ్యం రావాలంటే ఏకగ్రీవాలు జరగాలన్నదే మా విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నిమ్మగడ్డ తనకు తాను మేధావిగా చెప్పుకుంటున్నారని, అది తప్పు అన్నారు. రాజకీయ దురుద్దేశంతో మాపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖయలు ఉన్నాయని, ఇవి బాధాకరమన్నారు. రాజ్యాంగబద్ధంగా తనను నియమించిన గవర్నర్‌నే బెదిరించేలా నిమ్మగడ్డ లేఖ ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.