మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో ఊరట

అమరావతి, ఫిబ్రవరి 10 (న్యూస్‌టైమ్): స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇటీవల విధించిన ఆంక్షలపై ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పెడ్డిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేస్తూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించడానికి కూడా వీల్లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. ఎస్‌ఈసీ ఆర్డర్స్‌ను వ్యతిరేకిస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు.

ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. ఎస్‌ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి గతవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన​ దాఖలు చేశారు. దీనిపై ఆదివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టివేసింది. మంత్రిపై నిర్బంధం విధిస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టింది. మంత్రి ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.

అయితే మీడియాతో మాట్లాడకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం న్యాయస్థానం తొలుత సమర్థించింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ మీడియాతో మాట్లాడకుండా ఉండాలంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఆంక్షలను తప్పుపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

Latest News