ఆంధ్రప్రదేశ్జిల్లాలునేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయంవిశాఖపట్నం

నర్సీపట్నంలో ఘనంగా పోలీసు అమరవీరుల వారోత్సవ ముగింపు ర్యాలీ.

నర్సీపట్నం,కోస్తాటైమ్స్ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని నర్సీపట్నం పట్టణ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ఆబిద్ సెంటర్ వరకు పోలీసులు,విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆబిద్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు వారందరి త్యాగాలను స్మరణకు తెచ్చుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ గోవిందరావు మాట్లాడుతూ,1959 వ సంవత్సరంలో భారత సరిహద్దులోని సియాచిన్ ప్రాంతంలో పదిమంది సిఆర్పిఎఫ్ జవాన్లను చైనా పోలీసులు చంపేశారని, అప్పటినుండి అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అక్టోబర్ 21 నుండి 28వ తేదీ వరకు వారం రోజులపాటు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి, ఎస్ డి పి ఓ కే.ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో పట్టణ సీఐ ఎన్ గణేష్ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు పోలీసుల విధులపై అవగాహన కల్పించేందుకు, పోలీసు అమరవీరులను స్మరించుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శుక్రవారం వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ బ్యాండ్ పార్టీ సహకారంతో, విద్యార్థినీ విద్యార్థుల సమన్వయంతో ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు దేశం కోసం, ప్రజల కోసం ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వారందరి త్యాగాలు గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటల వరకే డ్యూటీ చేస్తారని, అయితే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారని గుర్తించాలని అన్నారు. పోలీసుల విధి నిర్వహణలో ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు సిబ్బంది, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు…