జాతీయం

నేడు కార్మికుల దేశవ్యాప్త సమ్మె

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (న్యూస్‌టైమ్): కేంద్ర బడ్జె‌ట్‌లో ప్రభుత్వం ప్రక‌టిం‌చిన ప్రైవే‌టై‌జే‌షన్‌ వంటి ప్రజా వ్యతి‌రేక నిర్ణయా‌లకు నిర‌స‌నగా నేడు కార్మిక సంఘాలు దేశ‌వ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు పది కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఇందులో భాగంగా ఐఎన్‌టీయూసీ, హిందూ మజ్దూర్‌ సభ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్మిక స్మృతులు, 2020 విద్యుత్‌ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేద కార్మికులకు ఆదాయ, ఆహార మద్దతుకు చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్‌ విద్యోగుల సమ్మెలో పాల్గొననున్నారు. విద్యుత్‌ రంగంలో కేంద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో టీఎస్‌పీఈ, టీఎస్‌ఈఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పాల్గొననుంది. విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు రూపొందించిన స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలావుండగా, గత నెలలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ డే పరేడ్‌లో చెలరేగిన హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామ సుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న నిర్వహించిన ర్యాలీలో విధ్వంసం చోటు చేసుకుంది. వేలాది మంది ఆందోళనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై సైతం దాడికి దిగారు. ఎర్రకోటలో మతానికి సంబంధించిన జెండాలను ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు కమిషన్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా రైతుల కొనసాగుతుందని, అయితే ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా ‘హింసాత్మక మలుపు’ తీసుకుందని న్యాయవాది తివారి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజల రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసిందని, ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.

ప్రస్తుతం న్యాయవాదులతో సహా పలు వృత్తుల్లో ఉన్న వారికి ఇంటర్నెట్‌ చాలా అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులకు, మీడియాకు ఆదేశాలివ్వాలంటూ మనోహర్‌లాల్‌ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్​ దాఖలు చేశారు. రైతుల నిరసనను దెబ్బతీసేందుకు ప్రణాళికబద్దమైన కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదిగా ప్రకటించే ‘తప్పుడు ఆరోపణలు, చర్యలను’ ప్రచారం చేయడాన్ని నిషేధించాలని కోరారు. న్యాయవాదులు విశాల్‌ తివారి, మనోహర్‌లాల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లను కూడా కోర్టు విచారించనుంది.