తెలంగాణ

కొత్త సచివాలయ పనులు వేగవంతం

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): కొత్త సచివాలయం నిర్మాణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రధాన గేట్‌తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు.

డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇ.ఎన్.సి గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులున్నారు.