పచ్చపార్టీ కార్యకర్తలా నిమ్మగడ్డ ప్రవర్తన

వైయస్‌ షర్మిల నిర్ణయం.. ఆమె వ్యక్తిగతం…

వైయస్‌ఆర్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల..

అమరావతి, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ పర్ఫామెన్స్‌ ఎంత అద్బుతంగా ఉందో రెండేళ్ల తరువాత సీఎం వైయస్‌ జగన్‌ తీసుకొచ్చిన సంక్షేమ పాలనతో ప్రజల్లో మరింత ఆదరాభిమానాలు పెరిగాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయం నిశ్చమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమం కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిమళ్లించేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేశారని, బాబు కుయుక్తులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ఏదో ఘోరం జరిగిపోతుందనే అలజడి సృష్టించే చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రయత్నాలను ప్రజలంతా చూశారన్నారు. చంద్రబాబుకు కుట్రలు చేయడం పుట్టుకతో వచ్చిందేనని, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తలా ప్రవర్తించారన్నారు.

ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అధికార దుర్వినియోగంపై కొత్త చర్చకు తెరలేపాలని వైయస్‌ఆర్‌సీపీ భావిస్తుందన్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తిస్తూ నైతికతను గాలికివదిలేశాడన్నారు. ఎన్నికల కమిషన్‌ వ్యవస్థ తన పని చిత్తశుద్ధిగా చేసే విధంగా, పరిధి దాటకుండా కట్టడి చేయడానికి మార్గాలు ఏంటని, దీనిపై సంస్కరణలు రావాలని, ఆ దిశగా జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని భావిస్తున్నామన్నారు.

అన్నాచెల్లెలి మధ్య భిన్నాభిప్రాయాలే కానీ, విభేదాలు లేవు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తరణపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని, తెలంగాణలో పార్టీ విస్తరణ వద్దని సీఎం సూచించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయమన్నారు. తెలంగాణలో మరో పార్టీ పెట్టాలన్నది వైయస్‌ షర్మిల ఆలోచనగా కనిపిస్తోందన్నారు. అన్నాచెల్లెలి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనని సజ్జల చెప్పారు. ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయాలనే తపన సీఎం వైయస్‌ జగన్‌లో చాలా బలంగా ఉందన్నారు. ఏపీకే కట్టుబడి ఉండాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ నిశ్చితాభిప్రాయమని చెప్పారు.

‘‘దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ, వైయస్‌ జగన్‌ సహోదరి వైయస్‌ షర్మిలమ్మ కోట్లాది మందికి పరిచయం. ప్రస్తుత పరిణామాలపై తప్పుడు భాష్యం వచ్చే అవకాశం ఉంది. మహానేత వైయస్‌ఆర్‌ మరణం తరువాతి పరిస్థితుల నేపథ్యంలో కోట్లాది మంది అభిమానుల నుంచి వచ్చిన కోరిక, ఆయన మరణం తట్టుకోలేక గుండెలు ఆగిపోయిన సంఘటనలు చూసి వైయస్‌ జగన్‌ కదిలారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు గెంటే ప్రయత్నం చేయడం కాంగ్రెస్‌ను కాదని తండ్రీకొడుకు మాత్రమే బయటకు వచ్చి ఆ తరువాత అభిమానించే ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం ఇలా వైయస్‌ఆర్‌సీపీ జర్నీ మొదలైంది. అక్రమ కేసుల్లో వైయస్‌ జగన్‌ జైల్లో ఉన్నప్పుడు వైయస్‌ షర్మిలమ్మ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆదరణతో వైయస్‌ జగన్‌ ముందుండి పోరాడి పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం. ఈ మధ్యలోనే కాంగ్రెస్‌ పార్టీ దుర్బుద్ధితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. 2014–19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్లీ 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ప్రజాతీర్పుతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో వైయస్‌ఆర్‌ సీపీపై మొదటి నుంచి ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణలో వైయస్‌ఆర్‌ అభిమానులు చాలా మంది ఉన్నారు. అక్కడి ఆకాంక్షలు చాలా ఉన్నాయని చర్చించాం. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ చాలా క్లారిటీతో ఉన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం, సహకారంతో సాధించుకోవాల్సినవి చాలా అంశాలు ఉంటాయి. ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర భిన్న ప్రయోజనాలు ఉంటాయి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. పార్టీ విస్తరణతో నష్టమే ఎక్కువగా వస్తుందని ముందు నుంచి చెబుతున్నారు. షర్మిలమ్మ వ్యక్తిగతంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అన్నాచెల్లెలి మధ్య విభేధాలు లేవు.. భిన్నాభిప్రాయాలు మాత్రమే. ఎలాంటి వ్యక్తిగత విషయాలు లేవు. పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉండాలా? వద్దా? ఉంటే దాని వల్ల వచ్చే లాభనష్టాలు? వంటి అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. షర్మిలమ్మకు పార్టీ పెట్టడం వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు, పరిమితులపై నచ్చజెప్పాం. షర్మిలమ్మ కూడా రాజకీయ అనుభవజ్ఞురాలు. సుదీర్ఘకాలం ప్రజల మధ్య నడిచింది. వేరే పార్టీలతో వైయస్‌ఆర్‌సీపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు.. ఉండబోవు’’ అని సజ్జల స్పష్టం చేశారు.

Latest News