రాష్ట్రీయం

‘చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారు’

చిత్తూరు, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబునాయుడికి ఘోర పరాభవం ఎదురైంద‌ని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా చంద్ర‌బాబును తిర‌స్క‌రించార‌ని చెప్పారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం పంచాయతీలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నార‌ని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా, వాటిలో 4 పంచాయతీలు మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయ‌ని ఇందులో 74 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారులు స‌ర్పంచ్‌లుగా గెలిచార‌ని, కేవ‌లం 14 చోట్ల మాత్ర‌మే టీడీపీ మ‌ద్ద‌తుదారులు గెలిచిన‌ట్లు చెప్పారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నార‌ని, మూడున్నర దశాబ్దాల కాలంలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ వర్గీయుల పాగా వేయగా, ఈ సారి అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేశార‌ని చెప్పారు.

చంద్రబాబును మనవడితో ఆడుకోవడానికి ఇంటికి పంపేశారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వెళ్లి ఏం పీకాడని ప్రశ్నించిన చంద్రబాబును ప్రజలు కుప్పం నుంచి పీకేశారని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.