రాష్ట్రీయం

చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం

అమరావతి, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నాలుగో దశ పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోగల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకోనేలా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే మూడు దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. తుది దశలో 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 554 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవాళ పోలింగ్‌ జరిగిన 2,743 సర్పంచి స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండు చోట్ల సర్పంచి స్థానాలకు, 91 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ దశతో రాష్ట్రంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తవుతాయి. నాలుగో దశ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 28,995 పోలింగ్‌ కేంద్రాల్లో 38 శాతం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. 6,047 పోలింగ్‌ కేంద్రాలు సమస్మాత్మక, మరో 4,967 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణ, పర్యవేక్షణ, ఓట్ల లెక్కింపు కోసం 96 వేల మంది అధికారులు, ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు, ఎక్కడైనా లోపాలుంటే గుర్తించి వెంటనే సరి చేసేలా వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో చిత్రీకరించారు.

నెల్లూరు జిల్లాలోని పలు పంచాయతీల పరిధిలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా ఓటర్లు గొడుగులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6.30 గంటల నుంచే బారులుదీరిన ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగానే పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పాతరావిచర్లలో పోలింగ్‌ కేంద్రంలోకి వాలంటీర్‌ పదే పదే వెళ్లడం వివాదానికి దారి తీసింది. కుటుంబ సభ్యులకు సాయం చేసే నెపంతో వస్తున్న వాలంటీర్‌కు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వాలంటీర్‌ ప్రవేశంపై మరో వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వాలంటీర్‌ను అక్కడి నుంచి పంపేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

కృష్ణా జిల్లా ఉంగుటూరు జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులతో ఓటు వేయించేందుకు బయటి వ్యక్తి రావటంతో ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌వో, పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపెడులో ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. దీంతో పోలింగ్‌ నిలిచింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాసేపు తర్వాత ఓటింగ్‌‌ తిరిగి ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్లు పంచాయతీలోని తొమ్మిదో వార్డులో ఎన్నికల అధికారులతో ఓ వృద్ధురాలు వాగ్వాదానికి దిగారు. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలికి అధికారులు అప్పటికే ఓటు నమోదైందని చెప్పడంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు ఇతరులు ఎలా వేస్తారని ఆమె అధికారులను నిలదీశారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం బేవన్నహళ్లిలో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన సర్పంచి అభ్యర్థి భాగ్యమ్మ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందాపురంలో ఓటింగ్‌ ప్రారంభమైన మూడు గంటల్లోనే 72 శాతం పోలింగ్‌ నమోదైందని ఆర్‌వో తెలిపారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం గణపర్రులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైకాపాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు పంచాయతీ బరిలో నిలిచారు. ఇవాళ పోలింగ్ సందర్భంగా ఓ వర్గం రిగ్గింగ్‌కు పాల్పడిందని మరో వర్గం ఆందోళన చేస్తోంది. ఫలితంగా పోలింగ్ నిలిచిపోయింది. ఇరువర్గాలకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలింగ్ కొనసాగేలా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన లక్ష్మీబాయమ్మ అనే మహిళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న సిబ్బంది ఆమెను అంబులెన్సులో కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై తెదేపా నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్యటించడంపై తెదేపా నేతలు నిరసన తెలిపారు. పోలింగ్‌ ఉదయం 10.30 గంటలకు 41.55 శాతంగా నమోదైంది. అప్పటివరకూ విజయనగరం జిల్లాలో అత్యధికంగా 54.70 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. కొన్ని చోట్ల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో తమను ఓట్లు వేయనీయడం లేదంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివచ్చిన విద్యార్థులకు అప్పటికే వారి ఓట్లు నమోదైనట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఓట్లు ముందే నమోదు కావడంపై అధికారులను నిలదీశారు. గుర్తింపు కార్డులు సరిగా లేవని మరికొందరు ఓటు వేయడానికి అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఘటనాస్థలికి వచ్చిన తహసీల్దార్‌ వాహనాన్ని ఓటర్లు అడ్డుకున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజయనగరం, విశాఖ జిల్లాలలో ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొత్తవలస, పెందుర్తి మండలంలోని సిరసపల్లి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ సరళి గురించి ఎస్పీ, జేసీని అడిగి ఆయన తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లపై ఓటర్లతో డీజీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు.

కర్నూలు జిల్లా ఆలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. అభ్యర్థుల గుర్తులు ప్రచారం చేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు ఘటనాస్థలి నుంచి పంపేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. పోలింగ్‌ నేపథ్యంలో వస్తున్న అన్ని ఫిర్యాదులపై స్పందిస్తున్నామని వివరించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం ముట్లూరులో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఏజెంట్‌పై ఓ వర్గం దాడి చేసింది. గంప గుత్తగా ఓట్లు వేసుకుంటున్నారని మరో వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డిపాళెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరి ఓటు మరొకరు వేశారంటూ ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు వడ్డిపాళెంలో భారీగా మోహరించారు.

విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వేరే చోటు నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఓ వర్గం మరో వర్గంతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీలో ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలింగ్ కేంద్రం ఎదుట అధికార పార్టీ మద్దతు, రెబల్ అభ్యర్థుల అనుచరులు వాగ్వాదానికి దిగారు. పంచాయతీలో నివసించని వ్యక్తి ఓటు ఎలా వేస్తారంటూ అధికార పార్టీ మద్దతు నాయకులు రెబల్ అభ్యర్థి అనుచరులను అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణ నెలకొంది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లెలో విషాదం నెలకొంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసి బయటికి వచ్చిన వృద్ధుడు బుచ్చన్న(65) సొమ్మసిల్లిపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వృద్ధుడు మృతిచెందాడు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 66.60 శాతం పోలింగ్‌ నమోదైంది. విజయనగరంలో అత్యధికంగా 77.20 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగికున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామం అయిన ఫిరంగిపురం వెళ్లిన ఆమె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ఓ అభ్యర్థి యత్నించారు. ఈ చర్యను మరో వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులను వారిని చెదరగొట్టారు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. ఆదివారం జరిగిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిశాయి. అప్పటివరకూ క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. అన్ని చర్యలు తీసుకుని, సిబ్బందిని ప్రోత్సహించారని అన్నారు. నాలుగోదశలో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారని తెలిపారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం గుణపర్రులో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. వృద్ధురాలి ఓటును పోలింగ్‌ సిబ్బందే వేశారంటూ పలువురు ఆందోళనకు దిగారు. రీపోలింగ్‌ నిర్వహించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథ్‌ గుణపర్రుకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

ఏపీ పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్‌ నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ తెలిపారు. మధ్యాహ్నం 3-30 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా 87.09 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.