అవీ ఇవీ...

ఆకట్టుకున్న ప్రదీప్ తొలిప్రయత్నం!

హైదరాబాద్, జనవరి 29 (న్యూస్‌టైమ్): ‘నీలి.. నీలి.. ఆకాశం’ పాట అంత బాగుంటుందని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా థియేటర్స్‌కి రప్పించాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా పరిచయం అయిన డెబ్యూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు (జనవరి 29)న భారీగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగుందా అన్నది రివ్యూలో చూద్దాం. టీజర్, ట్రైలర్ అలాగే నీలి నీలి ఆకాశం సాంగ్‌లో రివీల్ చేసినట్టుగానే ఈ సినిమా పునర్జన్మల కథ. బ్రిటీష్ కాలం నాటి పల్లెటూరి ప్రేమకథలో అమ్మాయి గారు (అమృతా అయ్యర్) అబ్బాయిగారు (ప్రదీప్) ప్రేమికులు.

ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే అబ్బాయిగారికి అమ్మాయిగారితో పాటు కుస్తీ పోటీలన్నా మహా ఇష్టం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని బ్రిటీష్ వారితో కుస్తీ పోటీలకు వెళ్తాడు అబ్బాయి గారు. అయితే సీన్‌లోకి అమ్మాయి గారు వచ్చి నేను కావాలా కుస్తీ పోటీలు కావాలా? అని నిలదీస్తే అమ్మాయిగారు నన్ను విడిచి ఎక్కడికి పోతుందిలే కుస్తీలో గెలిస్తే 90 రూపాయిలు వస్తాయి, ఆ డబ్బుతో అమ్మాయిగారికి పెళ్లి చీర నేస్తాను అనుకుని కుస్తీ పోటీనే ముఖ్యం అని అమ్మాయిగారికి తేల్చిచెప్పేస్తాడు. దీంతో అమ్మాయిగారికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తారు ఇంట్లో వాళ్లు. ఒకడ్ని ప్రేమించి వేరే వాడ్ని పెళ్లి చేసుకోలేను, నాకంటే కుస్తీ పోటీ ఎక్కువనుకున్నాడన్న కోపంలో ఆత్మహత్య చేసుకుంటుంది అమ్మాయిగారు. అక్కడ అబ్బాయిగారు కుస్తీ పడుతుండగా అమ్మాయిగారి పెళ్లి అవుతుందనే వార్త చెవిన పడటంతో బ్రిటీష్ వాళ్ల చేతుల్లో తన్నులు తిని ప్రాణం విడిచేస్తాడు. సీన్ కట్ చేస్తే గత జన్మలో చనిపోయిన అమ్మాయి గారు అబ్బాయిగారు మళ్లీ అర్జున్, అక్షరగా పునర్జన్మ ఎత్తి వైజాగ్‌లో ఒకే ఇంజనీరింగ్ కాలేజ్‌లో దర్శనం ఇస్తారు. అయితే వీరిని గత జన్మ తాలుకా జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి? అవి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. అర్జున్, అక్షరలు 30 రోజుల్లో తిరిగి ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే మిగిలిన కథ.

ఈ సినిమా చూడాలనుకునేవారికి నోట్ ఏంటంటే ఓపెనింగ్ సెగ్మెంట్ మాత్రం మిస్ కాకూడదు. అసలు కథ ఓపెనింగ్‌లో మొదలౌతుంది. కథా నేపథ్యం కూడా ‘నీలి నీలి ఆకాశం’ పాటలోనే ఉండటంతో ప్రారంభం మిస్ కాకూడదు. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా అని ఈ సినిమా విడుదల సందర్భంగా యాంకర్ ప్రదీప్ ప్రామిస్ చేశాడు. అయితే ఆ చిరునవ్వు ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ వరకే పరిమితం అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసిన తరువాత. ప్రేక్షకులకు తెలియని కొత్త వ్యక్తిని హీరోగా పరిచయం చేయాలంటే పెద్ద టాస్క్. జనం రిసీవింగ్ ఎలా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ యాంకర్ ప్రదీప్ హీరోగా కొత్తే కానీ అలాంటి భయాలు అవసరం లేదు.

ఎందుకంటే ప్రదీప్ గత పదేళ్లుగా అటు బుల్లితెరకు, ఇటు వెండితెరకు పరిచయమే. అందుకే యాంకర్ ప్రదీప్ హీరోగా సినిమా అంటే చాలామందిలో ధీమా వచ్చింది. దీనికి తోడు ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ప్రదీప్‌‌‌కి డెబ్యూలోనే బీభత్సమైన క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. పాట అంత బావుంటుంది ఈ సినిమా అని ప్రచారం చేసినా పాటే బాగుంది అనేట్టుగా ఈ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ఉంది. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుడు మున్నా (ఫణి ప్రదీప్)‌ సీరియస్ నోట్‌తో కథను మొదలుపెట్టాడు. పాత్రల ఎంపికలోనూ టేకింగ్‌లోనూ ప్రజెంటేషన్‌లోనూ కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కలగదు. పునర్జన్మల నేపథ్యంలో కథను డీసెంట్‌గానే రాసుకున్నాడు కానీ కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాడనే అనిపిస్తుంది.

ఈ సినిమా కథ మొదట అల్లు అర్జున్‌కి చెప్పినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలతో స్క్రిప్ట్‌లు మార్పులు చేశారట మున్నా అయితే, సినిమా చూసిన తరవాత బన్నీ మరికొన్ని ప్రశ్నలు వేసుంటే కథ గజిబిజి లేకుండా ఉండేదేమో అనిపిస్తుంది. సీరియస్ నోట్‌తో కథ మొదలుపెట్టినా బ్రిటీష్ కాలం నాటి కథ కుస్తీలో 90 రూపాయల కోసం ప్రేయసి వద్దను కోవడం అప్పుడే అమ్మాయిగారి పెళ్లి వెంటనే అబ్బాయిగారు కూడా చనిపోవడం ఇదంతా కన్వెన్సింగ్‌గా అనిపించదు. వాళ్లు చనిపోవడానికి మరో జన్మ ఎత్తడానికి బలమైన కారణం చూపించలేదనిపిస్తుంది. గత జన్మలో చనిపోయిన ప్రేమజంట మళ్లీ పునర్జన్మ ఎత్తి కలుసుకునే కీలకమైన సీన్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథలో కీలకం కాగా ‘జంబలకిడిపంబ’ను గుర్తుకు తెస్తుంది.

వినోదాన్ని పంచడంలో భాగంగా ఈ ట్రాక్ రాసుకున్నా.. ఇక్కడే కథ ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. కీలకమైన సన్నివేశాలు ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్‌ను చాలా బాగా చూపించినప్పటికీ కథలో కావాలని తీసుకొచ్చిపెట్టినట్టుగా అనిపిస్తాయి. కథను గాడిన పెట్టే కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపించడంతో పాటు ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్ చేయలేకపోయాయి. అయితే. మదర్, ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ సీన్లు సినిమాకి హెల్ప్ అయ్యాయి. హీరోగా ప్రదీప్‌కి మొదటి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్న నటుడిలా చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు ప్రదీప్.

లుక్స్‌తో బాక్సర్‌గా మంచి ఫిజిక్‌లో కనిపించాడు. ఇక డాన్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్లు ప్రదీప్‌కి కొట్టినపిండే అన్నట్టుగానే చేశాడు. ఇక మదర్ సెంటిమెంట్ పురుడు పోసే సీన్‌లో సెకండాఫ్‌లో లవ్ ప్రపోజ్ చేసే సీన్లలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ హీరోయిన్ అమృతా అయ్య‌ర్ అమ్మాయిగారుగా చాలా క్యూట్‌గా కనిపించిన అమృత అక్షరగా తనలోని అన్ని షేడ్స్ చూపించింది. అమాయకంగా కనిపిస్తూనే మోడరన్ డ్రెస్‌లు వేసి మందు కొడుతూ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ చూపించింది. ఒక రకంగా ఎమోషనల్ సీన్స్‌లో ప్రదీప్ డామినేట్ చేసింది.

ఇక ప్రదీప్‌కి ఫ్రెండ్‌గా చేసిన హర్ష, భద్రంలు నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హర్షకి అధిక ప్రాధాన్యత ఉంది. హీరోయిన్ కాంబినేషన్‌లో హర్ష బెడ్ రూం సీన్ బాగా పేలింది. ఇక ప్రదీప్‌కి తల్లిగా హేమ ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించింది. హీరోయిన్ తండ్రిగా పోసాని క్రిష్ణమురళి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టకున్నాడు. ప్రదీప్ కాంబినేషన్ సీన్లలో నవ్వులు పంచాడు పోసాని. శుభలేక సుధాకర్-రంగస్థలం మహేష్‌లతో ఈ సినిమా కథ ప్రారంభం కానుండగా స్వామిజీగా శుభలేక సుధాకర్ అతని శిష్యుడిగా రంగస్థలం మహేష్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ సంగీతం. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నీలి నీలి ఆకాశం పాటతో పాటు ఇదేరా స్నేహం, మీకో దండం సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

‘అమ్మా నన్ను మళ్లీ పెంచవా’ అనే మదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ప్లస్ కాగా ఎడిటింగ్ మైనస్. సెకండాఫ్‌లో అక్కర్లేని సన్నివేశాలు స్లోగా సాగుతున్న కథకు అడ్డంగా తగులుతుంటాయి. రన్ టైం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’? నీలి నీలి ఆకాశం పాట అంత అయితే బాలేదు. ప్రదీప్‌ని ఇష్టపడేవాళ్లైతే ఒకసారి చూడొచ్చు.