ఆంధ్రప్రదేశ్న్యూస్రాజకీయంరాష్ట్రీయంవిశాఖపట్నం

ప్రధానమంత్రి విశాఖ పర్యటన,బహిరంగ సభ విజయవంతం చేయండి.

నర్సీపట్నం, కోస్తాటైమ్స్ : ఈనెల 12వ తేదీన విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, బహిరంగ సభను భారీగా విజయవంతం చేయాలని, ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. సోమవారం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్12వ తేదీన విశాఖపట్నంలో జరగబోవుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో దాదాపు పదివేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని, కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు కాగా, మరికొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ప్రధానమంత్రిని ఘనంగా స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని, దాదాపు రెండు లక్షల నుండి రెండున్నర లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి కాదని, యావత్ భారతదేశానికి ఆయన ప్రధాని అని అన్నారు. అధికారిక పర్యటనలో ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయనను ఘనంగా స్వాగతించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అందుకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభకు నర్సీపట్నం నియోజకవర్గం నుండి కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ప్రధానమంత్రి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు కొండా రాజీవ్ గాంధీ, ఆర్ఈసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, నాలుగు మండలాల, మున్సిపాలిటీ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు,కో -ఆప్షన్ మెంబర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.