రాజకీయం

పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పు

విశాఖపట్నం, జనవరి 21 (న్యూస్‌టైమ్): విశాఖలో పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వహించిన రేషన్ సరుకుల రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేస్తాం. పౌరసరఫరాల పంపిణీలో నూతన అధ్యాయం. ఇంటి వద్దకే ఈ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యం, రేషన్ సరఫరా. అవినీతికి అవకాశం లేకుండా అన్ని వాహనాలకు ట్రాకింగ్ సౌకర్యం ఉంది. పేదలకు మంచి రకమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రెండు నెలలుగా ఈ పథకం అమలు కోసం కసరత్తు చేశాం. ఈ పథకం వల్ల 828 మందికి ఉపాధి దక్కింది.’’ అని అన్నారు.

‘‘అర్హత ఉండి రేషన్ కార్డు లేని వారికి వారం రోజుల లోపు కార్డు వచ్చేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో 12 లక్షల మంది పేద ప్రజలకు, 828 నిరుద్యోగులకు, లబ్ది చేకూర్చే పథకం. రేషన్ కార్డు దారుల కష్టాలకు నేటితో ముగింపు. నాణ్యమైన సరుకుల పంపిణీ లక్ష్యం. సంచార వాహనం ద్వారా సరుకుల పంపిణీ రాష్ట్రంలో మొదటి సారి చేస్తున్న ఘనత మన మఖ్యమంత్రికి దక్కింది. తన ఎన్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 100% నేరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలన ఇలా ఉంటుంది అని చంద్రబాబు ఊహించలేదు. మఖ్యమంత్రిని ఎదుర్కోలేక ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారు.’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాధ్, భాగ్యలక్ష్మి, చెట్టి ఫాళ్గుణ, బాబురావు, జిల్లా కలెక్టర్ వినాయచంద్, ఙీవీఎంసీ కమిషనర్ సృజన, తదితరులు పాల్గొన్నారు.