న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు అనే సంస్కరణ వ్యవస్థను దేశంలో విజయవంతంగా అమలు చేసిన 12వ రాష్ట్రంగా రాజస్థాన్ పేరుగాంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిర్దేశించిన ఈ సంస్కరణను రాజస్థాన్ సమర్థంగా అమలు చేసింది. తద్వారా బహిరంగ మార్కెట్లో రుణాల సేకరణ ద్వారా అదనంగా రూ. 2,731 కోట్ల మేర ఆర్థిక వనరుల సేకరణకు రాజస్థాన్ అర్హత సాధించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం తగిన అనుమతిని ఇప్పటికే మంజూరు చేసింది. ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు అన్న సంస్కరణను ఇప్పటికే విజయవంతంగా అమలు చేసిన 11 రాష్ట్రాల సరసన తాజాగా రాజస్థాన్ చేరింది. ఇప్పటివరకూ ఆంధప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ సంస్కరణను సమర్థవంతంగా అమలు చేశాయి.
ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు సంస్కరణను విజయంవతంగా అమలు చేసిన ఈ 12 రాష్ట్రాలకు అదనపు రుణాల సేకరణకు అనుమతి లభించింది. మొత్తం రూ. 33,440 కోట్ల మేర రుణాల సేకరణకు ఈ రాష్ట్రాలకు కేంద్ర వ్యయ శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా రాష్ట్రాలకు ఈ కింది సూచించిన మొత్తాల్లో అదనపు రుణాల సేకరణకు అనుమతి లభించింది. పౌరప్రయోజనాలే లక్ష్యంగా చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒక దేశం ఒకే రేషన్ కార్డు వ్యవస్థ కూడా ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) కింద లబ్ధిదారులకు రేషన్ కార్డుతో పాటుగా ఇతర సంక్షేమ పథకాలను అందుబాటులో ఉంచేందుకు ఈ సంస్కరణ దోహదపడుతుంది. ప్రత్యేకించి వలస కూలీలు, వారు కుటుంబాలు దేశవ్యాప్తంగా ఏ రేషన్ దుకాణంలో అయినా రేషన్ సరకులు, తదితర ప్రయోజనాలు పొందడానికి ఈ వ్యవస్థ వీలు కలిగిస్తుంది. ఎక్కువగా వలస జీవులకు ఆహార సాధికారత కల్పించేందుకు ఈ సంస్కరణ ఉపకరిస్తుంది.
ప్రత్యేకించి కార్మికులు, దినసరి కూలీలు, పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరించేవారు, వీధుల్లో రోడ్లపక్క నివాసం ఉండేవారు, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని తాత్కాలిక కార్మికులు, ఇళ్లలోని పనిమనుషులు తదితరులకు కూడా ఈ ఇది ఉపయోగపడుతుంది. జీవనోపాధికోసం తమ నివాసాన్ని తరచుగా మార్చుకుంటూ వెళ్లే నిరుపేదల ఆహార భద్రతపై స్వావలంబన సాధించేందుకు ఇది దోహదపడుతుంది. ఒక దేశం ఒకే రేషన్ కార్డు వ్యవస్థను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా,.. ఎలెక్టానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పోస్) సదుపాయం కలిగిన ఏ రేషన్ దుకాణంలో అయినా ఆహార ధాన్యాలను వలస కూలీలు, కార్మికులు తమ అర్హతగా పొందేందుకు ఈ పథకం వీలు కలిగిస్తుంది.
వివిధ రాష్ట్రాలు,. మరింత మెరుగ్గా లబ్ధిదారులకు పథకాలను అందించేందుకు, నకిలీ, బోగస్ కార్డు దారులను, అనర్హులను గుర్తించి, మరింత సమర్థవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా ఈ సంస్కరణ ఉపయోగడుతుంది. దీనికి తోడు,..రాష్ట్రాల మధ్య రేషన్ కార్డుల మార్పిడికి (పోర్టబిలిటీకి) అవకాశం కల్పించాలంటే,.. అన్ని రేషన్ కార్డులను ఆధార్ నంబరుతో సీడింగ్ చేయడంతో పాటు లబ్ధిదారులను బయోమెట్రిక్ పద్థతిలో అధీకృతం చేయడం, అన్ని రేషన్ దుకాణాలను ఈ-పోస్ పరికరాలతో సాంకేతికంగా అనుసంధానం చేయడం చాలా అవసరం. అందువల్ల రాష్ట్ర స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.)లో 0.25శాతం పరిమితితో సమానమైన మొత్తాన్ని వివిధ రాష్ట్రాలు అధనపు రుణాలుగా సేకరించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ కింద పేర్కొన్న రెండు కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అదనపు రుణాల సేకరణకు అనుమతి ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులను, లబ్ధిదారులను ఆధార్ నంబరుతో సీడింగ్ చేయడం, రాష్ట్రంలోని అన్ని చవక ధరల (రేషన్) దుకాణాలకు సాంకేతికతను కల్పించడం ఈ వ్యవస్థలో ముఖ్యోద్దేశం. వైరస్ మహమ్మారి వ్యాప్తితో తలెత్తిన పలు రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ఈ ఏడాది మే నెల 17న రాష్ట్రాలకు ఆర్థికపరంగా ఒక వెసులుబాటు కల్పించింది. రాష్టాల రుణ సేకరణ పరిమితిని,. రాష్ట్ర స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.)లో 2శాతానికి సమానమైన మొత్తానికి పెంచుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఈ మొత్తంలో సగం, అంటే జి.ఎస్.డి.పి.లో ఒకశాతానికి సమానమైన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు చేపట్టే పౌర ప్రయోజన పథకాలకు అనుసంధానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని వ్యయ శాఖ గుర్తించిన నాలుగు పౌర ప్రయోజన పథకాల్లో, ఒక దేశం, ఒకే రేషన్ కార్డు వ్యవస్థ, సులభతర వాణిజ్య నిర్వహణా సంస్కరణ, పట్టణ స్థానిక సంస్థ/వినియోగ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు నిర్దేశిత సంస్కరణల్లో ఇప్పటివరకూ 17 రాష్ట్రాలు కనీసం ఒకటైనా అమలు చేశాయి. తద్వారా, సంస్కరణలతో ముడివడిన రుణాల సేకరణకు అనుమతులను కూడా అవి సాధించాయి.
ఈ 17 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు ఒకదేశం, ఒకే రేషన్ కార్డు వ్యవస్థను, సులభతర వాణిజ్య నిర్వహణ సంస్కరణను అమలు చేశాయి. 5 రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణలను, రెండు రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్కరణలను అమలు చేశాయి. దీనితో మొత్తం రూ. 74,773కోట్ల మేర సంస్కరణలతో ముడివడిన అదనపు రుణాణ సేకరణకు వివిధ రాష్ట్రాలకు అనుమతి లభించింది.