నేరాలు .. ఘోరాలు

వివాహితపై అత్యాచారం, హత్య

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): కూలీ పనికి వెళ్లిన వివాహిత తిరిగిరాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపే రైలుపట్టాల పక్కన శవమై కనిపించింది. నోట్లోగుడ్డలుకుక్కి దారుణ స్థితిలో మహిళ విగతజీవిగా దర్శనమిచ్చింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ధారూర్ మండలం ఆవుసుపల్లికి చెందిన వివాహిత(38) భర్త, కొడుకు, కూతురుతో కలసి ఉంటోంది. పొలం పనులు లేని సమయంలో అడ్డా కూలీ చేసుకుని జీవనం సాగించేవారు.

కూలీ పని కోసం వికారాబాద్ వెళ్లిన మహిళ రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం పోలీసులను ఆశ్రయించారు. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే వికారాబాద్ సమీపంలోని ఆలంపల్లి నుంచి గిరిగేట్‌పల్లి వెళ్లే దారిలో రైలు పట్టాల పక్కన మహిళ శవం కనిపించిందన్న సమాచారం రావడంతో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతదేహం కనిపించకుండా పోయిన వివాహితదిగా గుర్తించారు. నోట్లో గుడ్డలు కుక్కి దారుణ స్థితిలో ఆమె విగతజీవిగా కనిపించింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ సంజీవరావు, సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.