రాష్ట్రీయం

ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాయిదా

అమరావతి, జనవరి 26 (న్యూస్‌టైమ్): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం మరోసారి వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభోత్సవం రద్దయింది. ఫిబ్రవరి 1న అనంతపురం జిల్లా కదిరిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అధికారులు రద్దు చేశారు.

దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడినట్లైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి కొత్తపథకాలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ కార్యక్రమానికి ఏదీ కలిసిరావడం లేదు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్‌డౌన్, ఆ తర్వత కొత్త కార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. రేషన్ డోర్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9260 వాహనాలను ఈనెల 21న ప్రారంభించింది.

ఈ వాహనాలను వాహనాలను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందించింది. ఇప్పటికే వాహనాలన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చేరుకున్నాయి.

డోర్ డెలివరీ వాహనాలను టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది. మొత్తానికి ఫిబ్రవరి 1 ఈ పథకాన్ని ప్రారంభించాలని నెల రోజుల క్రితమే ప్రభుత్వం భావించింది. పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధతత నెలకొన్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఎన్నికలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మరో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు పథకాన్ని ప్రారంభించడానికి వీలులేకుండా పోయింది.