రాజకీయం

ఆర్కేవి నీతి క‌బుర్లు: టీడీపీ

మంగళగిరి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ఎన్నిక‌లు జ‌ర‌ప‌కుండా బెదిరించి, భ‌య‌పెట్టి, కొంద‌రిని చంపేసి ఏక‌గ్రీవాలు జ‌రుపుకున్న వైసీపీ ఇప్పుడు టిడిపి తీసుకున్న‌ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యంపై మాట్లాడ‌టం విడ్డూరంగా వుంద‌ని మంగ‌ళ‌గిరి టిడిపి నేత‌లు పోతినేని శ్రీనివాస‌రావు, గూడూరు వెంక‌ట‌రావు, ఉన్నం ఝూన్సీరాణిలు ఎద్దేవ చేశారు. ఇటీవ‌లే 40వ ఆవిర్భావ దినోత్స‌వం చేసుకున్న తెలుగుదేశం పార్టీ వైసీపీలాంటి కోడిక‌త్తి పార్టీల‌ను ఈ 4 ద‌శాబ్దాల‌లో ఎన్నో చూసింద‌న్నారు. ‘‘క‌రోనాతో ఎన్నిక‌లు వాయిదా వేస్తే ఎన్నిక‌లు కావాల‌న్న వైసీపీ, క‌రోనా త‌గ్గాక ఎన్నిక‌లు పెడితే అమ్మో క‌రోనా వ‌ద్దంటూ యాగీ చేసిన జ‌గ‌న్ నాట‌కాల‌ను మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే మ‌రిచిపోవ‌చ్చు, ఎందుకంటే ఆయ‌నే రోజూ క‌మ‌ల్‌హాస‌న్‌ని మించిన వంద‌ల మారువేషాలు వేస్తాడు కాబ‌ట్టి.. జ‌నాలు మ‌రిచిపోరు క‌దా!’’ అని గుర్తు చేశారు.

పోలీసుల్ని, అధికార‌యంత్రాంగాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని టిడిపి మ‌ద్ద‌తుదారులు గెలిచిన చోట్ల కూడా రీ కౌంటింగ్ పేరుతో, క‌రెంట్ ఆపి త‌మ‌కు అనుకూలంగా ఫ‌లితాలు ప్ర‌క‌టించుకున్న వైసీపీ ఇప్పుడు వాళ్ల ఇంట్లో ర‌బ్బ‌రు స్టాంపులాంటి మ‌నిషిని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తెచ్చుకున్నాక జ‌రిగే ఎన్నిక‌లు ఎంత ఏక‌ప‌క్షంగా వుంటాయో చెప్ప‌క్క‌ర్లేదని పేర్కొన్నారు. ముక్క‌లైన మూటగా తండ్రి శవం ప‌క్క‌న ఉంచుకుని ముఖ్య‌మంత్రి కావ‌డానికి సంత‌కాలు సేక‌రించిన అత్యంత దుర్మార్గ చ‌రిత్ర వున్న వ్య‌క్తి సీఎంగా వున్న‌ప్పుడు జ‌రిగే అరాచ‌క ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం ప్ర‌మాద‌క‌రం కాబ‌ట్టే టిడిపి ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిందని వివ‌రించారు. సొంత బాబాయ్‌ని చంపేసి గుండెపోటు అని చిత్రీక‌రించిన వైసీపీ అధినేత సీఎంగా వున్న రాష్ట్రంలో ఎన్నిక‌ల్లో పైచేయి కోసం టిడిపి అభ్య‌ర్థుల్ని చంప‌డానికి కూడా వెనుకాడ‌టంలేద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో తెలుగుదేశం కుటుంబ‌ స‌భ్యుల్లాంటి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, టిడిపి అభ్య‌ర్థుల్ని కాపాడుకునే ల‌క్ష్యంతో తమ నాయ‌కుడు చంద్ర‌బాబు తీసుకున్న ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యంపై నీ అక్క‌సేంటి రామ‌కృష్ణారెడ్డీ అని వారు ప్ర‌శ్నించారు.

వైసీపీ ప్ర‌భుత్వంపైనా, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేపైనా ప్ర‌జ‌లలో వ్య‌తిరేక‌త తీవ్రంగా వుందన్నారు. అది బ‌య‌ట‌ప‌డ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తో బెదిరించి, భ‌య‌పెట్టి జ‌రుపుతున్న‌ది ఎల‌క్ష‌న్ కాదు.. సెల‌క్ష‌న్ అని ఆరోపించారు‌. దుగ్గిరాల‌లో టిడిపి కార్య‌క‌ర్త‌ల అభీష్టం మేర‌కు పోటీ చేస్తామంటే.. నీకెందుకు ఉలుకు అని ఎమ్మెల్యేని ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పాలిట రాక్ష‌సుడిగా మారిన రామ‌కృష్ణారెడ్డిని ప్ర‌జ‌లు ఓడించాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. దుగ్గిరాల‌లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన ఎమ్మెల్యే ఇప్ప‌టికే టిడిపి అభ్య‌ర్థుల్ని కిడ్నాప్ చేయించార‌ని, బెదిరింపుల‌కు దిగినా లొంగ‌క‌పోవ‌డంతో ఇలా బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు దిగార‌ని ఆరోపించారు. దుగ్గిరాల‌లో వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌నే భ‌యంతో, సంత‌లో ప‌శువుల్లా ఇద్ద‌రు టిడిపి అభ్య‌ర్థుల్ని కొనుగోలు చేశార‌ని ఎద్దేవ చేశారు.

ఓట‌మి భ‌యంతో టిడిపి అభ్య‌ర్థుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ‘‘చంద్ర‌బాబు, లోకేష్ మ‌ధ్య విభేదాలు త‌రువాత సృష్టిద్దువుగానీ ముందు మీ జ‌గ‌న‌న్న ఓ చెల్లి ఢిల్లీలో నా తండ్రిని ఎవ‌రు చంపార‌ని ప్ర‌శ్నిస్తోంది, మ‌రో చెల్లి తెలంగాణ‌లో నా అన్న అన్యాయం చేశాడ‌ని లొల్లి చేస్తోంది.. ఇంట్లో ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం చేయ‌ని అన్న‌ సొంత బాబాయ్‌ని చంపితే ప‌ట్టించుకోని అబ్బాయ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ఉద్ధ‌రిస్తాడ‌ని ఎలా చెబుతావు రామ‌కృష్ణారెడ్డి’’ అంటూ నిల‌దీశారు. అన్యాయ‌మైపోయిన చెల్లి వైపా? అన్యాయం చేసిన అన్న‌వైపా? ఆర్కే అనేది స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌నే భ‌యంతో టిడిపి అభ్య‌ర్థుల్ని కొనుక్కున్న ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి టిడిపికి నీతి క‌బుర్లు చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌న్నారు.

అధికార యంత్రాంగాన్ని వాడుకోకుండా, వైసీపీ గూండాయిజం ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆర్కే ఎన్నిక‌లు ఎదుర్కోవాల‌ని స‌‌వాల్ విసిరారు. చేతిలో ల‌క్ష‌లు పెట్టి మెడ‌లో వైసీపీ కండువాలు వేసిన ఇద్ద‌రి టిడిపి అభ్య‌ర్థుల్ని నీ చెర నుంచి వ‌దిలేసి ఎన్నిక‌‌లలో ధైర్యంగా పోటీచేయాల‌ని ఆర్కేకి సూచించారు. రాత్రి అయితే చాలు టిడిపి అభ్య‌ర్థుల ఇళ్ల చుట్టూ తిరిగే ఎమ్మెల్యే ఆర్కే రాజ‌కీయాల్లో విలువ‌లు గురించి మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు ఉంద‌న్నారు.