జాతీయం

రూ. 25,228.35 కోట్ల విలువైన పత్తి బేళ్ల సేకరణ

న్యూఢిల్లీ, జనవరి 22 (న్యూస్‌టైమ్): ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కనీస మద్దతు ధరపై రైతులనుంచి పంటల సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్లో 2020-21సంవత్సరపు ఖరీఫ్ పంటలను ప్రభుత్వం సేకరిస్తోంది. 2020-21వ సంవత్సరపు ఖరీఫ్ సీజన్‌కు గాను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంటల సేకరణ ప్రక్రకియ సజావుగా సాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఈ ఏడాది జనవరి 20నాటికి, 575.36 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు జరిగింది. గత ఏడాది ఇదే వ్యవధిలో జరిగిన సేకరణ కంటే ఇది 23.41శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే వ్యవధిలో 466.22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కొనుగోలు చేసిన మొత్తం 575.36 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఒక్క పంజాబ్ రాష్ట్రంనుంచే 202.77లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. అంటే,.సేకరణ జరిగిన మొత్తం ధాన్యంలో 3524శాతాన్ని పంజాబ్ లోనే కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కొనసాగుతున్న ధాన్యం సేకరణ ద్వారా ఇప్పటికే దాదాపు 82.08 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. రూ. 1,08,629.27కోట్ల విలువైన కనీస మద్దతు ధరతో ఈ ధాన్యం సేకరణ జరిగింది.

పైగా, వివిధ రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనలమేరకు, 2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 51.66 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకు అనుమతించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్దతు ధర పథకం (పి.ఎస్.ఎస్.) కింద ఈ సేకరణ ప్రక్రియ జరుగుతుంది. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 1.23లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల సేకరణకు కూడా అనుమతించారు. అలాగే, 2020-21 సంవత్సరపు రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకు అనుమతి ఇచ్చారు.

ఇక, ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం, ఆయా రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనలకు అనుగుణంగా ధరల మద్దతు పథకం కింద పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకు అనుమతి ఇస్తారు. దీనితో 2020-21వ సంవత్సరానికి, ముందస్తుగా నమోదు చేసుకున్న రైతులనుంచి మేలిరకం సగటు నాణ్యతా గ్రేడ్ పంటలను కనీస మద్దతు ధరపై నేరుగా సేకరణ జరిపేందుకు వీలు కలుగుతుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కనీస మద్దతు ధరకంటే పంటల మార్కెట్ ధర తక్కువగా ఉన్న పక్షంలో ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసిన సంస్థల ద్వారా కేంద్ర నోడల్ ఏజన్సీలు ఈ సేకరణను నిర్వహిస్తాయి.

ఈ ఏడాది జనవరి 20నాటికి ప్రభుత్వం తన నోడల్ ఏజన్సీల ద్వారా 2,98,252.48 మెట్రిక్ టన్నుల పెసలు, మినుములు, కంది, వేరుశనగ, సోయాబీన్ పంటలను సేకరించింది. రూ.1,620.04 కోట్ల మేర విలువైన కనీస మద్దతు ధరతో జరిగిన ఈ సేకరణతో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 1,59,951 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి 20 నాటికి, 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల సేకరణ జరిగింది. రూ. 52.40 కోట్ల మేర విలువైన కనీస మద్దతు ధరపై జరిగిన ఈ కొనుగోలు ప్రక్రియతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 3,961 రైతులకు ప్రయోజనం చేకూరింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 293.34 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల కొనుగోలు జరిగింది. ఇక, కొబ్బరి కురిడీలు, మినుములు ప్రధానంగా పండించే రాష్టాల్లో ఆయా పంటల ధరలు కనీస మద్దతు ధరకంటే ఎక్కువగానే ఉన్నాయి. కాగా, ఖరీఫ్ పప్పు దినుసులు, నూనె గింజల పంటలు చేతికందే సమయాన్ని బట్టి, ఆయా రాష్ట్రాలు నిర్ణయించే తేదీలనుంచి పంటల సేకరణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇక పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరపై గింజపత్తి సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి 20నాటికి, రూ. 25,228.35 కోట్ల మేర విలువైన 86,36,488 పత్తి బేళ్లను సేకరించారు. ఈ సేకరణ ప్రక్రియతో 1,773,226 మంది రైతులు ప్రయోజనం పొందారు.