రాజకీయం

తమిళ రాజకీయాల్లో శశికళ దూకుడు

చెన్నై, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): తమిళ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వి.కె. శశికళ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న జయలలిత జయంతి సందర్భంగా పార్టీ ముఖ్యలతో సమావేశం కానున్నారు. వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం గురించి కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరో 2-3 నెలల్లో జరగనున్నాయి.

జైలు నుంచి ఇంటికి వచ్చిన తరువాత వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న శశికళ ఇక దూకుడు పెంచనున్నారు. ఈ నెల 24న జయలలిత జయంతి సందర్బంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. వైద్యుల సూచనల మేరకు వారం పదిరోజుల వరకూ స్వీయ నిర్బంధంలో ఉన్న శశికళ ఇక కేడర్‌లో దూసుకెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పదవిలో తనను కూర్చోబెట్డడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటనేది పన్నీర్ సెల్వంకు బాగా తెలుసని దినకరన్ తెలిపారు. ఆయన ఒకవేళ భరతుడే అయితే, చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధమైతే, ఆహ్వానించేందుకు తాము సిద్ధమేనని చెప్పారు దినకరన్. ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని, అయితే ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకురాలేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.

మరోవైపు జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నాయి. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో విచారణ జరిగి జైలు శిక్ష అనుభవించిన శశికళ నాలుగేళ్ల తరవాత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఆమెకు కరోనా వైరస్ కూడ సోకింది. అప్పట్లో ఆమెను బెంగళూరులోని విక్టోరియా అసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు నిర్ధారించాక, ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో చెన్నైకి తిరిగి వచ్చిన ఆమె తమిళనాట రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఆమె జైలులో గడిపిన నాలుగేళ్ల కాలంలో తమిళ రాజకీయాలలో అనేక మార్పులు వచ్చాయి. జయలలిత మరణించిన తరవాత శశికళ సమర్థనతో పన్నిర్‌ సెల్వన్‌‌ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తరవాత ఆయన ఆమెకే ఎదురు తిరిగారు. అన్నా డీఎంకే అంతర్గత రాజకీయాల వల్ల పన్నీర్‌ సెల్వన్‌ కూడా పదవీచ్యుతులయ్యారు. ప్రస్తుతం ఎడపాడ్డి పళని స్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పన్నీర్‌ సెల్వన్‌, పళని స్వామి మధ్య కూడా రాజీకుదిరింది. అయితే, శశికళ దివగంత జయలలితకు సన్నిహితురాలు అన్న మాట సామాన్యమైంది కాదు. జయలలిత ఉన్నన్నాళ్లూ ఆమె నివాసం అయిన వేదనిలయంపై పెత్తనం అంతా శశికళదే. ఆ సమయంలో రాజకీయాల్లో శశికళ ప్రమేయం బహిరంగంగా అయితే కనిపించలేదు కానీ సకల విషయాలు జయలలిత తరఫున ఆమే చక్కబెట్టే వారు. జయలలిత మరణం తరవాత శశికళ ఒంటరి అయిపోయినా చక్రం తిప్పి పన్నీర్‌ సెల్వన్‌‌ను ముఖ్యమంత్రిని చేయగలిగారు. ఆమె చెన్నైకి తిరిగి వచ్చాక గృహవసతితో సహా అన్నీ సరికొత్తగా సమకూర్చుకోవలసి వచ్చినప్పటికీ పూర్వవైభవానికి దగ్గరలోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు చర్చంతా రాజకీయాలలో ఆమె స్థానం ఏమిటన్నదానిపైనే.

శశికళ తత్వాన్నిబట్టి ఆమె మిన్నకుండే మనిషి కారు. ఆమె సమీప బంధువు టి.టి.వి. దినకరన్‌ అమ్మ మక్కల్‌ మున్నెట్ర కగజం (ఎ.ఎం.ఎం.కె.) పార్టీ పెట్టారు. 2016 ఎన్నికలలో పోటీ చేసి నాలుగు శాతం ఓట్లు సంపాదించారు. దినకరన్‌ పార్టీ కూడా పళనిస్వామితో పొత్తు పెట్టుకునే ఉంది. దినకరన్‌ పెట్టిన పార్టీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం, ఒకప్పుడు అన్నా డీఎంకేలో ప్రత్యర్థులుగా ఉన్న పన్నీర్‌ సెల్వన్‌, పళని స్వామి మధ్య రాజీ కుదరడంతో శశికళ తన స్థానం ఏమిటో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైంది. చాలా కాలం ఆమె జయలలితతో పాటు వేదనిలయంలో ఉండి సర్వం సహాధికారిగా మెలగినప్పటికీ ఆ ఇంట్లోకి వెళ్లడానికి వీలు లేదు. తమిళనాడు ప్రభుత్వం ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని జయలలిత స్మారక చిహ్నంగా మార్చింది.

శశికళ జైలు నుంచి విడుదలైన రోజు ఆ స్మారక చిహ్నాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచారు. శశికళ గూడు వెతుక్కోవడం, మళ్లీ రాజకీయాల్లో కల్పించుకోవాలా లేదా, ఒక వేళ కల్పించుకుంటే అనుసరించే వ్యూహం ఏమిటి అన్నవి ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలే. 2017లో పెరోల్‌ మీద విడుదలైనప్పుడు శశికళ తన వదిన ఇలవరసి కూతురు కృష్ణ ప్రియ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడూ ఆమె ఇంటికి దగ్గరలోనే ఇల్లు వెతుకుతున్నారనే సమాచారం ఉంది. శశికళను చిన్నమ్మ అంటారు. చిన్నమ్మ మళ్లీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే రాజకీయ సమీకరణలు మారతాయన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

శశికళ ఇదివరకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వేదికెక్కి అన్నా డీఎంకే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనూ లేదు. అయినా ఆమెకు అన్నా డీఎంకేలో గణనీయమైన మద్దతు ఉండేదంటారు. అంతేకాక జయలలిత హయాంలో ప్రభుత్వంలోనూ ఆమె మాటకు విలువ ఉండేదంటారు. శశికళకు అంతరాంతరాల్లో ఒకప్పుడు జయలలిత అలంకరించిన ముఖ్య మంత్రి స్థానాన్ని ఆక్రమించాలన్న ఆశ లేకపోలేదు. దినకరన్‌ మాటలు శశికళ లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అన్నా డీఎంకే మీద మళ్లీ పట్టు సంపాదించడమే తాను ఎ.ఎం.ఎం.కె. ఏర్పాటు చేయడానికి కారణం అని ఆయన దాపరికం లేకుండానే చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం కృషి చేస్తామని తెగేసి చెప్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి దారి మార్చి పన్నీర్‌ సెల్వన్‌‌తో చేయి కలిపి శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. అన్నా డీఎంకేలో స్థానం లేదంటున్నారు. అంటే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే మొదటి అడుగు దినకరన్‌ ఏర్పాటు చేసిన పార్టీలో చేరవచ్చు. ఈ పార్టీ అన్నడీఎంకేతో సఖ్యంగానే ఉంది కనక క్రమంగా అన్నా డీఎంకే పార్టీ మీదే పట్టు సాధించే అవకాశమూ లేకపోలేదు.

మరో మార్గం ఏమిటంటే శశికళ ఎ.ఎం.ఎం.కె.లో చేరి మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు అధికార కూటమిలో ఉన్న పక్షాలు నెమ్మదిగా అమ్మ మున్నెట్ర కగజంతో చేతులు కలపవచ్చు. ఎస్‌. రాందాస్‌ నాయకత్వంలోని పట్టల్‌ మక్కల్‌ కచ్చి (పి.ఎం.కె.)తో పాటు కెప్టెన్‌ విజయకాంత్‌ ఏర్పాటు చేసిన ఎం.డి.ఎం.కె. ఇప్పటికైతే అధికార కూటమిలోనే ఉన్నాయి. కానీ తమ పార్టీలకు తగినన్ని సీట్లు కేటాయిస్తే ఈ రెండు పార్టీలు కూడా శశికళ శిబిరంలో చేరవచ్చు. పి.ఎం.కె.కు ఇప్పుడు తమిళనాడు శాసనసభలో ఒక్క సీటు కూడా లేదు. మూడో ఫ్రంట్‌ ఏర్పడితే రాందాస్‌కు అందులోచేరడం రాజకీయంగా ప్రయోజనకరం అన్న అభిప్రాయం కలగవచ్చు. అన్నాడీ ఎంకేకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సఖ్యత కొనసాగుతోంది కనక మూడో ఫ్రంట్‌ ఏర్పాటు లాభదాయకం అన్న ఊహలు కూడా ఉన్నాయి. కెప్టెన్‌ విజయకాంత్‌ భార్య ప్రేమలత ఇటీవల దూకుడుగా ఒక ప్రకటన చేశారు. ఇంతకు ముందు ఆమె తమిళనాడు రాజకీయాల్లో శశికళ పలుకుబడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్నారు. పళని స్వామి ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి కాదని ఆయనను ఆయన పార్టీ వారు ఎన్నుకున్నారని అన్నారు.

శశికళ రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయం అని చెప్పడానికి కూడా జయలలిత అంత్యక్రియల్లో జరిగిన సంఘటనను కూడా గుర్తు చేస్తున్నారు. అప్పుడు శశికళ మూడు సార్లు జయలలిత శవం చుట్టూ ప్రదక్షిణ చేసి మూడుసార్లు నేల మీద చరిచారు. ఇది ఆమె అన్ని అడ్డంకులను, ద్రోహాన్ని, కుట్రలను అధిగమిస్తాను అని కరాఖండిగా చెప్పడానికి సంకేతం అని భాష్యాలు చెప్తున్నారు. అందువల్ల ఆమె దినకరన్‌ పార్టీలో చేరి క్రమంగా అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలన్న వ్యూహాన్ని అనుసరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. శశికళ మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అధికార పక్షానికి మద్దతిస్తున్న వారు అమ్మా మున్నెట్ర కగజం వేపు మొగ్గి చూపి వరసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న అన్నాడీఎంకే కలలను వమ్ము చేయవచ్చు. మొత్తానికి తమిళనాట రాజకీయాలు జయలలిత జయంతి నాటికి ఒక్కసారిగా వేడెక్కనున్నాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.