ఎస్డీపీఎఫ్ జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు
తిరుపతి, జనవరి 23 (న్యూస్‌టైమ్): జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో మూడవ స్థానంలో విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారులను ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభినందించారు. శనివారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి కబడ్డీ క్రీడాకారులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని సూచించారు. మీ వంటి యువత క్రీడల్లో బాగా రాణించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఫెడరేషన్ ఇండియా (ఎస్డీపీఎఫ్) ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కైతల్‌లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన అండర్ – 17 కబడ్డీ పోటీలకు రాష్ట్రం తరపున (తరుణ్ కెప్టెన్సీ)లో 11 మంది క్రీడాకారులు బృందం వెళ్ళింది.
ఈ పోటీలో దేశం నలుమూలల నుంచి 45 టీమ్‌లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీలో రాష్ట్రం తరపున పాల్గొన్న టీమ్ మూడవ స్థానం కైవసం చేసుకుంది. హర్యానా వెళ్లిన కబడ్డీ బృందంలో ఎస్డీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, కోచ్ శివతో పాటు కెప్టెన్ తరుణ్, కేతన్, ఉదయ్, హరి, ప్రేమ్, తరుణ్, అర్జున్, వీరేష్, సందీప్, రాజేష్, సురేంద్ర ఉన్నారు.