ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చర్యలు ఆక్షేపణీయం
చిత్తూరు, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చర్యలు ఆక్షేపణీయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏకగ్రీవమైన పంచాయతీలను హోల్డ్‌లో పెట్టడం సరికాదని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై భవిష్యత్‌లో చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అయితే తప్పెంటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, నిమ్మగడ్డ సొంత జిల్లా గుంటూరులో అధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, వాటిని హోల్డ్‌లో పెట్టడం సమంజసం కాదన్నారు. తొలి దశలో 513 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయన్నారు. ఇది కొత్తమే కాదని తెలిపారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలో ఉందని నిలదీశారు. ఓటు నమోదు చేయడం కూడా తెలీని వ్యక్తి ఎస్‌ఈసీగా ఉన్నారని తప్పుపట్టారు. తనకు అధికారం ఉందని అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోకుండా టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేశానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు మేలు చేస్తే తనకు ఎమ్మెల్యేనో, ఎంపీ టిక్కెట్టో ఇస్తారని నిమ్మగడ్డ రమేష్ భావిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ టీడీపీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గురించి నిమ్మగడ్డకు పూర్తిగా తెలీదన్నారు. వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శించారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాటలు విని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పని చేసే అధికారులపై భవిష్యత్‌లో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు, అధికారులు రూల్స్ ప్రకారం పని చేయాలన్నారు. నిన్ననే చాలా జిల్లాల్లో ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ రిజల్డ్‌ను హోల్డ్‌లో పెట్టాలనే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారి అధికారంలో జోక్యం చేసుకునే హక్కు ఎస్‌ఈసీకి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మంత్రి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.