రాష్ట్రీయం

ఎస్ఈసీ కార్యదర్శి మార్పు

అమరావతి, జనవరి 29 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల బదిలీల వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి వాణీ మోహన్‌ను తన ఆదేశాలు పాటించలేదంటూ ప్రభుత్వానికి సరెండర్ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమయంలో ఎన్నికల సంఘానికి కార్యదర్శి అత్యవసరం కావడంతో ఆ పోస్టుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితానివ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు కె. కన్నబాబు, విజయ్‌కుమార్, రాజబాబు పేర్లను సూచించింది. ఈ జాబితాను పరిశీలంచిన నిమ్మగడ్డ చివరికి కన్నబాబును కార్యదర్శిగా నియమించారు.

ఎస్ఈసీ నిర్ణయం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కన్నబాబు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నబాబును ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్, ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ, మత్స్యశాఖ కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నీయమించినట్లు వార్తలు వచ్చాయి. ఈలోగా ప్రభుత్వం ఆయనకు వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించడం కోసం వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించింది.