రాష్ట్రీయం

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ ట్విస్ట్

ఆ ఇద్దరు అధికారుల బదిలీకి బ్రేక్…

అమరావతి, జనవరి 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)పై ఆధిపత్యం నెగ్గించుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో చివరికి రాజ్యాంగాన్ని గౌరవించకతప్పని పరిస్థితి ఎదురైంది. ఎస్ఈసీని తన అదుపాజ్ఞల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసి సుప్రీం కోర్టు గుమ్మాన్ని సైతం తొక్కి ఓటమిపాలవడమే కాకుండా యంత్రాంగంలోనూ పరువుపోగొట్టుకున్నట్లయింది.

అయితే, ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీల ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు సరికాదని, బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని సూచించింది. ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ బదిలీ వ్యవహారం గందరగోళంగా మారింది.

ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీల ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు సరికాదని, బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, నోటిఫికేషన్‌ రీ షెడ్యూల్‌ చేశామని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్గి ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్య కాదని వ్యాఖ్యానించింది. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందిపడే అవకాశముంది అన్నారు.

ఎస్ఈసీ పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ బదిలీ చేయాలని సూచించినట్లు సోమవారం ప్రచారం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే అంశాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ‘‘రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్‌ ఇప్పటికే బదిలీ అయ్యారు. ఆయన (నిమ్మగడ్డ రమేష్) ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. దీంతో మంగళవారం ఉదయం ఎస్‌ఈసీ ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనపై స్పందించింది.

మొత్తానికి ఏపీ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో పాటూ అధికార వర్గాల్లో కూడా హీట్ పెంచాయనే చెప్పాలి. సుప్రీం తీర్పు తర్వాత ఎస్ఈసీ మరింత దూకుడుతో వెళుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సూచన మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌ను బదిలీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.

అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్‌ పంపాల్సిందిగా ఎస్‌ఈసీ కోరడంతో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్‌ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. అలాగే గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సమయంలో కొంత మంది అధికారులను బదిలీ చేయాలని ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కూడా ప్రచారం అయింది.

ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌)కు మరోసారి లేఖ రాశారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్‌ ఆనంద్‌, భరత్‌ గుప్తా, గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఆ విధుల నుంచి వెంటనే తప్పించి, ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాచెర్ల సీఐ రాజేశ్వరరావును సస్పెండ్‌ చేయాలని, శ్రీకాళహిస్తి, పలమనేరు డీఎస్పీలు నాగేంద్రుడు, ఆరిఫుల్లా, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు తులసీరాం, తేజోమూర్తిలను బదిలీ చేయాలని సూచించారు. ఈ నెల 23న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ సమయంలో 22న ఎస్‌ఈసీ గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ (ప్రస్తుతం అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొందారు), శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి ఆయా జాయింట్‌ కలెక్టర్‌-1లు చార్జ్‌ తీసుకోవాలని, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, చిత్తూరు ఎస్పీకు చార్జ్‌ అప్పగించాలని సూచించారు.

అయితే ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సవాలు చేయడం వంటి కారణాలతో ప్రభుత్వం, ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు అనివార్యం కావడంతో ఆ అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ మరోసారి సీఎస్‌కు, జీఏడీకి లేఖ రాశారు.