జాతీయంతెలంగాణ

వెదురు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన సింగిరెడ్డి

చెన్నై, జనవరి 30 (న్యూస్‌టైమ్): తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో గ్రో మోర్ బయోటెక్ లిమిటెడ్ వెదురు పరిశోధన కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురు సాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని, దేశం ఏటా 7 లక్షల 200 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోందని, దేశంలో 50 లక్షల ఎకరాలలో వెదురు సాగుతో ఇథనాల్ తయారుచేయడం మూలంగా ఇంధన అవసరాలు తీరుతాయన్నారు.

గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ అధినేత, ప్రఖ్యాత వెదురు పరిశోధన శాస్త్రవేత్త భారతి అనుభవం వెదురు సాగులో ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ సందర్శన, భారతి అనుభవం విన్న తర్వాత స్వయంగా వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడి టిష్యూకల్చర్ విభాగం చాలాబాగుందని, బీమా బంబూ ఇథనాల్ (బ్లెండ్) తయారీకి అనుకూలంగా ఉందన్నారు. వెదురు ఒక్కసారి నాటితే 60, 70 ఏళ్లు దిగుబడి ఇస్తుందని, నాలుగో ఏడాది నుండి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ఎకరాకు ఏడాదికి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.4500 ధర పలుకుతుందన్నారు. ఏడాదికి రూ. లక్షా 20 వేల నుండి రూ. లక్షా 60 వేల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు.