పడుపు వృత్తితో పాడుపని

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): ఓ హోటల్‌లో పనిచేస్తున్న మహిళ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తప్పుడు పనిలోకి దిగింది. హోటల్ పని ద్వారా వచ్చే డబ్బు తన జల్సాలకు, విలాసాలకు సరిపోకపోవడంతో వ్యభిచార వృత్తి చేపట్టింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా చీకటి దందా నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మల్కాజిగిరి ఎస్‌ఐ హరి ప్రసాద్‌ కథనం ప్రకారం, మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పూజా కాంబ్లే (40) కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది.

మల్కాజిగిరిలోని సాయి నగర్‌లో నివాసముంటూ స్థానికంగా ఓ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన పూజ కొంతమంది అమ్మాయిల బ్రోకర్లతో జతకట్టింది. వారి సాయంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి తాను ఉంటున్న అద్దె ఇంట్లోనే గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు రాత్రి ఆమె ఇంటిపై దాడి చేశారు. పూజను రిమాండ్‌కు తరలించారు.

Latest News