‘గిడుగు’కు ఘన నివాళులు

శ్రీకాకుళం, జనవరి 22 (న్యూస్‌టైమ్): వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం బ్రిడ్జి రోడ్‌లో గల ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు.

సీపీఐ రాష్ట్ర జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి సేవలను కొనియాడారు. వ్యవహారిక భాషా పితామహుడిగా ప్రస్తుతం మాట్లాడుతున్న భాషపై సుదీర్ఘకాలం పోరాటం చేసి సాహిత్య పండితులను ఎదిరించి పోరాటం చేసిన విషయాలను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సవర భాషకు లిపి కనుగొని ఈ మూడు జిల్లాల్లో ఆ భాషపై గ్రంథస్తం చేసిన సందర్భం కూడా చెప్పారు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు ఈ నాటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వము ఆయన కుటుంబీకులు ఆయన స్వగ్రామమైన పర్వతాల పేటలో విగ్రహం నెలకొల్పడం మరిచిపోలేనిదన్నారు. ఈ సందర్భంగా సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేశ్వరరావు వందన సమర్పణ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు కూన పాపారావు, జిల్లా కార్యదర్శి ఎస్. ప్రసాద్, సామ్నా జిల్లా కార్యదర్శి చింతాడ అప్పలనాయుడు, పొందూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు, సబ్ ఎడిటర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Latest News