రాజకీయం

‘తిరుపతి రేసులో సోమిరెడ్డి’

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి సెటైర్లు…

నెల్లూరు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో మాజీ మంత్రి, శాసన సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం కోసం ఏర్పాటు చేసిన సభలో తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ శవమైపోయిందని, అంత్యక్రియలకు పాడిమోయడానికి నలుగురు అవసరం పడతారని, నలుగురిలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉండగా నాలుగో అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రేసులో ఉన్నాడని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కాకాణి. ఈ సందర్భంగా కాకాణి పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సైదాపురం ప్రజానీకానికి జీవితకాలం రుణపడి ఉంటా. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటు వేయమని అడుగుతున్నాం. గతంలో మంత్రిగా ఆనం రామనారాయణన్న, జిల్లా పరిషత్ చైర్మన్‌గా నేను, సైదాపురం మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయమని కోరుతున్నాం. పగలు బిజెపి, జనసేనను విమర్శిస్తూ, రాత్రులు వారితో కలిసి చీకటి కార్యకలాపాలు చేస్తూ, ఉమ్మడి అజెండాను అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందా? స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించామంటూ చెపుతూ, బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందా? పేద కుటుంబంలో జన్మించిన గురుమూర్తి లాంటి వ్యక్తి పేదల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించగలరు కానీ, పుట్టుకతోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు నిర్వహించిన కుటుంబాలకు చెందిన ఇతర అభ్యర్థులు పేదవారి గురించి ఆలోచించగలరా? వెంకటగిరి నియోజకవర్గంలో రామ నారాయణన్న ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తికి అత్యధిక మెజారిటీ అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నా.’’ అని కాకాణి అన్నారు.