ప్రాంతీయం

త్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ఎస్పీ మాటామంతీ

కడప, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): కడప జిల్లా ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు జిల్లా ఎస్పీ అన్బురాజన్. తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని, వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా శ్రమించాలే తప్ప ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, సీనియర్స్, జూనియర్స్ అనే బేధ భావాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని అన్బురాజన్ సూచించారు. అత్యున్నత స్థానాలకు ఎదిగి ట్రిపుల్ ఐటీకి మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చదువుపైనే దృష్టి సారించాలి తప్ప అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని ఎస్పీ హితవుపలికారు. ఐఐఐటీ విద్యార్థులు తమ సమస్యలేమైనా ఉంటే అధికారులు, కేర్ టేకర్ల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, గొడవలకు దిగి కేసుల్లో ఇన్వాల్వ్ అయి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, పులివెందుల రూరల్ సీఐ రవీంద్రనాథ్ రెడ్డి, వేంపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.