జాతీయం

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక విధానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): అనువైన విధానాల ద్వారా భారత వ్యవసాయ ఉత్పత్తులను మరింత ఎక్కువ చేసి వ్యవసాయ రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసింది. మరింత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తులను మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు ఎగుమతి చేసి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ముఖ్యంగా పాడైపోయే అవకాశాం వున్న వస్తువులపై దృష్టి సారించడంతో పాటు వినూత్న, స్వదేశీ , ఆర్గానిక్ సాంప్రదాయ, సాంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడడం ఇందులో ప్రధానం. అలాగే, మార్కెట్ అవసరాలను గుర్తించి వాటిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, పారిశుద్యం, పంటల రక్షణ అంశాలను పర్యవేక్షించడానికి సంస్థాగత యంత్రాంగానికి రూపకల్పన చేయడం, ప్రపంచ విలువ ఆధారిత అంశాలతో అనుసంధానం సాధించి ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో దేశ వాటాను రెట్టింపు చేయడానికి కృషి చేయడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులకు వున్న అవకాశాల ద్వారా రైతులు ప్రయోజనం పొందేలా చూడడం కూడా ముఖ్య లక్ష్యాలే.

వ్యవసాయ ఎగుమతి విధానంలో భాగంగా ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రస్తుత ఉత్పత్తులు, ఎగుమతులకు వున్న అవకాశాలు , వస్తువుల పరిమాణం, ఎగుమతుల మార్కెట్‌లో భారతదేశం కలిగి వున్న వాటా, ఎగుమతులను మరింత ఎక్కువ చేయడానికి గల అవకాశాలపై దృష్టి సారించి పనిచేయడానికి అనేక ప్రత్యేకమైన ఉత్పత్తి-జిల్లా సమూహాలను గుర్తించడం జరిగింది.