తెలంగాణ

ఉద్యోగుల వైద్యానికి ప్రత్యేక ట్రస్ట్‌!

హైదరాబాద్, జనవరి 29 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యసేవలు అందించడానికి ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసింది. ఈ ట్రస్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, వైద్యశాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఇద్దరు ఉద్యోగుల ప్రతినిధులు, పెన్షనర్ల ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది.

ట్రస్ట్‌ రోజువారీ కార్యకలాపాల కోసం కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, అడిషనల్‌, జాయింట్‌, డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన అధికారి, ఒక డాక్టర్‌, ఒక ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉండాలని, ఇతను హెల్త్‌ ఇన్సూరెన్స్‌తోపాటు మెడికల్‌ బిల్స్‌ క్లియర్‌ చేయడానికి అవసరమని పీఆర్సీ సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌తో సరైన సేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయి.

పోలీస్‌ శాఖలో అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా ట్రస్ట్‌ పనితీరు బాగున్నట్టు పీఆర్సీ అభిప్రాయపడింది. పోలీస్‌ సిబ్బంది వైద్యానికయ్యే ఖర్చులకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ వచ్చేవరకు ఎదురుచూడకుండా ఆసుపత్రి బిల్లులను ట్రస్ట్‌ కార్పస్‌ ఫండ్‌ నుంచి చెల్లిస్తున్నారు. దీనికి నిర్ణీత మొత్తాన్ని పోలీస్‌ సిబ్బంది అందిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా చేరిన వారి నుంచి నెలవారీ సభ్యత్వ రుసుమును వసూలు చేయడం ద్వారా కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. దీనిని పరిశీలించిన పీఆర్సీ ఇదే పద్ధతిలో ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించింది.

ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ట్రస్ట్‌కు కార్పస్‌ నిధిని సమకూర్చడం కోసం ఉద్యోగుల నుంచి ప్రతినెల వారి మూలవేతనం నుంచి ఒకశాతం మినహాయించుకోవాలని పీఆర్సీ సూచించింది. తద్వారా ఏడాదికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు సమకూరుతాయని పేర్కొంది. మూడేళ్లలో ఈ నిధి రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు చేరవచ్చని తెలిపింది. అప్పటివరకు ఆసుపత్రుల మెడికల్‌ బిల్లులను ఆర్థికశాఖ చెల్లించాలని సూచించింది. ఆ తరువాత రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలో ఆలస్యం జరిగినా ట్రస్ట్‌ ద్వారా చెల్లించవచ్చని అభిప్రాయపడింది.

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) కింద ఉంటూ రిటైరైన ఉద్యోగులకు కూడా ఈ ట్రస్ట్‌ ద్వారా వైద్య సేవలు అందించాలని తెలిపింది. సీపీఎస్‌ కింద ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత నెలవారీగా పెన్షన్‌ లభించదు. అందువల్ల రిటైరైన సమయంలోనే వీరి నుంచి ఒకేసారి తగిన మొత్తాన్ని సేకరించి ఈహెచ్‌ఎస్‌ పరిధిలో ఉంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అలాగే పెన్షన్‌దారులకు వ్యయ పెరుగుదలను పరిగణలోకి తీసుకొని వైద్యఖర్చులను నెలకు రూ.350 నుంచి రూ.600లకు పెంచి ప్రతినెల పెన్షన్‌తోపాటు వైద్య భత్యాన్ని ఇవ్వాలని సిఫారసు చేసింది.