న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ను (ఎన్‌యూహెచ్‌ఎం) 2013 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పట్టణ జనాభాకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంతోపాటు, మురికివాడలు, బడుగు వర్గాల ప్రజలపై ప్రత్యేక దృష్టిని పెట్టడం ఈ మిషన్ ఉద్దేశం. దీనిని రాష్ట్ర ఆరోగ్య విభాగాలు లేదా పట్టణ స్థానిక సంస్థల ద్వారా అమలుచేసే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ మిషన్ ప్రారంభం నుంచి ఆర్థిక, భౌతిక సాయం ఏటా పెరుగుతోంది.
ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.6493.28 కోట్లు విడుదలయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 5430 ఆరోగ్య కేంద్రాల (5246- యూపీహెచ్‌సీలు, 184 యూసీహెచ్‌సీలు) బలోపేతానికి, కొత్తగా 807 యూపీహెచ్‌సీలు, 86 యూసీహెచ్‌సీల నిర్మాణానికి సాయం అందింది. 3692 మంది వైద్యాధికారులు, 506 నిపుణులు, 36,037 మంది పారామెడికల్ సిబ్బంది నియామకం జరిగింది. 77,019 మంది ఆశాలు, 93,600 ఎంఏఎస్‌లు కూడా ఇందులో భాగమయ్యారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై), ఏబీ- ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల (హెచ్‌డబ్ల్యూసీ) ఏర్పాటు ఉద్దేశాలతో 2018లో ఏర్పాటైన ఆయుష్మాన్ భారత్ కింద, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవల శ్రేణిని పెంచుకుని హెచ్‌డబ్ల్యూసీలుగా పని చేస్తున్నాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌యూహెచ్‌ఎంల అమలును బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల్లో ఆర్థిక, భౌతిక పురోగతి పరిశీలనకు ఎప్పటికప్పుడు సమీక్షలు, సంప్రదింపులు, వీడియో కాన్ఫరెన్సులను నిర్వహిస్తోంది. ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌యూహెచ్‌ఎం కింద సేవలను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం సాంకేతిక సాయం, మార్గదర్శనం అందిస్తోంది. దృష్టి పెట్టాల్సిన ఆరోగ్య అంశాలపై బ్రోచర్లు తయారు చేసి రాష్ట్రాలకు పంపుతోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాల పర్యటనలతోపాటు, శిక్షణ, సామర్థ్య పెంపునకు కూడా కేంద్రం చేయూతనిస్తోంది.