సంస్కృతి

సుంద‌ర‌కాండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమల, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 189 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఈ పారాయణంతో తిరుమలగిరులు పులకించాయి. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు పారాయణం జరిగింది.

కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 318 రోజులు పూర్తి చేయగా, ఫిబ్రవరి 21వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 256 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని పండితులు తెలిపారు. సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల‌లోని 2,821 శ్లోకాల‌ను మొత్తం 16 ప‌ర్యాయాలు అఖండ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు. టిటిడి ఇప్పటివరకు 9 ప‌ర్యాయాలు సుందరకాండ అఖండ పారాయ‌ణం పూర్తి చేసింది.

పదో విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 189 శ్లోకాలను శేషాచార్యులు, ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, మారుతి పారాయ‌ణం చేశారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, బుల్లెమ్మ బృందం వీడివో అల విజయ రాఘవుడు…, సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించి పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు… సంకీర్తనతో ముగించారు. ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కుల‌ప‌తి ఆచార్య మురళీధరశర్మ, అన్న‌మాచార్య ప్రాజెక్ట్ సంచాల‌కులు దక్షిణామూర్తి, ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.