జాతీయం

పార్లమెంట్ దృష్టికి టీడీపీ దాడులు

అమరావతి, జనవరి 25 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని ఆల‌యాల‌పై టీడీపీ దాడుల‌ను పార్ల‌మెంట్ దృష్టికి తీసుకెళ్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఎంపీల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భేటీ అయ్యారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

భేటీ అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవుడి విగ్ర‌హాల ధ్వంసంలో చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉంద‌ని, ఆల‌‌యాల‌పై టీడీపీ దాడుల ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌న్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్ర‌త్యేక హోదా అంశంపై స‌మావేశంలో చ‌ర్చించామ‌న్నారు. పోల‌వ‌రం నిధులు, ప్ర‌త్యేక హోదా అంశాన్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తామ‌న్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కోరుతామ‌న్నారు.

క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లింపు అంశాన్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పార్ల‌మెంట్ దృష్టికి తీసుకెళ్తామ‌ని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తామ‌ని వెల్ల‌డించారు. నివర్ తుపాను న‌ష్ట‌ప‌రిహారం విడుద‌ల చేయాల‌ని కేంద్రాన్ని కోరుతామ‌న్నారు.