ప్రాంతీయం

తొలిదశ పల్లెపోరులో ఓటెత్తిన చైతన్యం

ఒంగోలు, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం ఉదయం 6.30 నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు, వారిని బలపరిచిన నాయకులు, మద్దతుదారులు తమ అభ్యర్థికే ఓటేయాలన్నట్లు రెండు చేతులు జోడించి సంజ్ఞలు చేయడం, చిరునవ్వుతో పలకరించడం కనిపించింది. పోలీసులు ముందు నుంచే ప్రత్యేక దృష్టిపెట్టి గ్రామాల్లో పర్యటించడం, స్థానికులకు భరోసా కల్పించి నిర్భయంగా ఓటేయాలని చెప్పడంతో గంట గంటకు పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 3.30కు ఈ ప్రక్రియ ముగుస్తుందనగా గంట ముందే సగం కేంద్రాల్లో ఓట్లు అత్యధికంగా పోలైపోయాయి. ఎన్నికలు జరిగిన 14 మండలాల్లో మొత్తమ్మీద 80.92, అత్యధికంగా చీమకుర్తిలో 87.58, అత్యల్పంగా నాగులుప్పలపాడులో 73.03 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఒంగోలు రెవెన్యూ డివిజన్లోని 192 పంచాయతీల్లో మంగళవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసినట్లుగా వేలికి పెట్టే సిరా గుర్తును చూపుతూ సహచరులతో ఆనందాన్ని పంచుకున్నారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 6.30 నుంచి 8.30 వరకు 8.96 శాతం నమోదైన పోలింగ్‌ గంట గంటకూ 19.23, 28.66, 43.19, 57.00, 68.01, 73.19, 80.92గా పెరుగుతూపోయింది.