జాతీయం

క‌స్ట‌మ్ సుంకం వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న.. మిన‌హాయింపుల స‌మీక్ష‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): క‌స్ట‌మ్స్ సుంకాన్ని హేతుబ‌ద్ధం చేసేందుకు, దేశీయ త‌యారీ రంగానికి ఊతం ఇచ్చేందుకు కేంద్ర బ‌డ్జెట్ 2021-22లో ప‌లు ప‌రోక్ష ప‌న్ను ప్ర‌తిపాద‌న‌లు చేశారు. కేంద్ర ఆర్ధిక‌, కార్పోరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈరోజు పార్ల‌మెంటు ముందు ఉంచారు.

జీఎస్‌టీ మ‌రింత స‌ర‌ళ‌త‌రం…

గ‌త కొద్ది నెల‌లలో రికార్డు స్థాయిలో జీఎస్‌టీ క‌లెక్ష‌న్లు రికార్డు అయ్యాయ‌ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌మ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో తెలియ‌జేశారు. జీఎస్‌టీని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నట్టు ఆమె తెలియ‌జేశారు. జీఎస్‌టీఎన్ కెపాసిటీ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌ను, న‌కిలీ బిల్లుదారుల‌ను గుర్తించేందుకు డీప్ అనాల‌సిస్‌, కృత్రిమ మేథను వినియోగించ‌డం జ‌రిగింద‌ని, జీఎస్‌టీని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, ఇన్వ‌ర్టెడ్ డ్యూటీ విధానంలోని లోపాల‌ను స‌వ‌రించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తి ఒక్క చ‌ర్య తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

క‌స్ట‌మ్స్ సుంకం రేష‌న‌లైజేష‌న్‌…

క‌స్ట‌మ్స్ సుంకం విధానం విష‌యంలో, దేశీయ త‌యారీ రంగాన్ని ప్రోత్స‌హించ‌డం, ఇండియా అంత‌ర్జాతీయ గ్లోబ‌ల్ వాల్యూ చెయిన్‌లో ముందుకు వెళ్లేందుకు స‌హాయ‌ప‌డ‌డం, మెరుగైన ఎగుమ‌తులు చేసేందుకు స‌హ‌క‌రించ‌డం అనే రెండు ప్ర‌ముఖ ల‌క్ష్యాల‌ను క‌స్ట‌మ్స్ డ్యూటీ పాల‌సీ క‌లిగి ఉంటుంద‌ని ఆర్ధిక మంత్రి చెప్పారు. ముడ‌స‌రుకును సుల‌భంగా అందుబాటులో ఉంచ‌డం, విలువ జోడింపు ఉత్ప‌త్తుల ఎగుమ‌తులపై దృష్టి ఉంచిన‌ట్టు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది క‌స్ట‌మ్స్ సుంకం వ్య‌వ‌స్థ‌లో 400కు పైగా మిన‌హాయింపుల‌ను స‌మీక్షించేందుకు ప్ర‌తిపాదించిన‌ట్టు ఆమె తెలిపారు. ఈ విష‌య‌మై 2021 అక్టోబ‌ర్1 నుంచి విస్తృత స్థాయి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌నున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. లోటుపాట్లు లేని సవ‌రించిన క‌స్ట‌మ్స్ సుంకం వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ట్టు ఆమె తెలిపింది. ఇక నుంచి ఏవైనా క‌స్ట‌మ్స్ సుంకం రాయితీలు వాటిని జారీ చేసిన తేదీ నుంచి త‌దుప‌రి రెండేళ్ళ‌కు వచ్చే మార్చి 31 నాటి వ‌ర‌కు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండ‌నున్నాయ‌ని ఆర్ధిక మంత్రి తెలిపారు.

ఎల‌క్ట్రానిక్‌, మొబైల్ ఫోన్ ప‌రిశ్ర‌మ‌…

మొబైల్ ఫోన్ల‌కు సంబంధించి చార్జ‌ర్ల పార్టులు, మొబైళ్ల ఉప పార్టుల‌కు సంబంధించి ఆర్ధిక‌ మంత్రి ప‌లు మిన‌హాయింపుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికితోడు మొబైల్స్‌కు సంబంధించి కొన్ని పార్టులు నిల్ రేట్‌నుంచి మోడ‌రేట్ 2.5 ప‌ర్సెంట్ జాబితాలోకి చేర‌నున్నాయి. నాన్ అల్లాయ్‌, అల్లాయ్‌, స్టెయిన్‌లెస్ స్టీల్‌కు సంబంధించిన లాంగ్ ఉత్ప‌త్తులు సెమీస్‌, ఫ్లాట్ ఉత్ప‌త్తుల‌పై ఏక‌రీతిన క‌స్ట‌మ్స్ సుంకాన్ని 7.5 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్టు ఆర్ధిక‌ మంత్రి ప్ర‌క‌టించారు. ఉక్కు తుక్కుపై సుంకం మిన‌హాయింపును 2022 మార్చి 31 వ‌ర‌కు మిన‌హాయింపును ఆర్ధిక మంత్రి ప్ర‌తిపాదించారు. కొన్ని ర‌కాల స్టీలు ఉత్పత్తుల‌పై ఎడిడి, సివిడిల‌ను సీతారామ‌న్ ఎత్తివేశారు. రాగి తుక్కుపై సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి ఆర్ధిక మంత్రి త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.