రాజకీయం

ఈ-వాచ్ యాప్ టీడీపీదే: ఏంపీలు బాల‌శౌరి, లావు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ఆవిష్క‌రించిన ఈ-వాచ్ యాప్ టీడీపీ ఆపీస్‌లో త‌యారైంద‌ని, అది ఆ పార్టీ యాప్ అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, లావు శ్రీ‌కృష్ణ‌దేవరాయులు పేర్కొన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు ఏక‌గ్రీవం కావ‌డం చంద్ర‌బాబు, నిమ్మ‌గ‌డ్డ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని వారు ధ్వ‌జ‌మెత్తారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎస్ఈసీ తీరును ఎంపీలు ఆక్షేపించారు. ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప‌నులు చూస్తుంటే రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజ్యాంగ వ్య‌తిరేక శ‌క్తిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే విష‌యంలో హైకోర్టు ఈరోజు మొట్టికాయ‌లు వేసింది. నిమ్మగడ్డ ప్రారంభించిన ఈ-వాచ్ యాప్ ఎక్క‌డ త‌యారైందో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ స్పష్టంగా తెలియజేయాలి. ఈ యాప్ ఎక్క‌డ త‌యారైందో విచార‌ణ జ‌ర‌గాలి. మాకు తెలిసినంత‌వ‌ర‌కు ఆ యాప్ టీడీపీ ఆఫీస్‌లో త‌యారైంది. ఎందుకంటే ఈ రోజు హైకోర్టు ఆ యాప్‌కు సంబంధించి సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వ‌మ‌ని అడిగితే దానికి ఐదు రోజులు స‌మ‌యం తీసుకున్నారు. టీడీపీ ఆఫీసులో కాకుండా, ప్రభుత్వపరంగా ఆ యాప్ త‌యారు చేసి ఉంటే ఎందుకు నాలుగు ఐదు రోజులు స‌మ‌యం తీసుకున్నారు?

గతంలోనూ ఆయన కేంద్ర హోం శాఖకు ఒక లెట‌ర్ రాశారు, ఆ లెట‌ర్ టీడీపీ ఆఫీస్‌లో త‌యారైందని తేటతెల్లమైంది. అలానే ఎన్నికల కమిషనర్ సొంతంగా, ప్రైవేటుగా తయారు చేయించిన యాప్ మీద కూడా, మాకు, రాష్ట్ర ప్ర‌జానీకానికి చాలా సందేహాలున్నాయి. నిమ్మ‌గ‌డ్డకు వ్య‌తిరేకంగా ఎప్పుడు కోర్టు నుండి ఆర్డ‌ర్స్ వ‌చ్చినా, మోష‌న్ మూప్ చేస్తూ ఉంటాడు. బ్రేక్ ఫాస్ట్ మోష‌న్ అంటాడు, మ‌ధ్యాహ్నం లంచ్ మోష‌న్ అని, సాయంత్రం హౌస్ మోష‌న్ అని అంటాడు, రాత్రి అయ్యే స‌రికి హైదరాబాద్ హ‌యాత్ హోట‌ల్‌లో పచ్చ చొక్కావారితో క‌లిసి కాక్ టైల్ మోష‌న్ మూవ్ చేసి అడ్డంగా దొరికాడు. హ‌యాత్ హోటలలో ప‌చ్చ చొక్క‌ాల వారితో క‌లిసి మీ కాక్ టైల్ డిన్న‌ర్‌లో ప‌ట్టుబ‌డిన త‌రువాత మీరు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి, మీరు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌డానికి అర్హులా, కాదా అన్నది? రూల్స్ ఏమైనా ఉండొచ్చు కానీ, ఎస్ఈసీ ప‌ద‌విలో ఉండి ఈ ర‌కంగా దొరికిపోయి ఇంకా ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌డానికి మీరు అర్హులా? నిమ్మగడ్డ వ్య‌వ‌హార‌శైలి హద్దుమీరి ప్ర‌వ‌ర్తిస్తున్నట్టు ఉంది. చిత్తురు, గుంటూరు జిల్లాలలో పంచాయితీ ఎన్నికల ఏక‌గ్రీవాల‌ను అంగీకరించనన్నట్టుగా వాటి ఫలితాలు వెల్లడి చేయవద్దని ఈరోజు నిమ్మగడ్డ ఆర్డ‌ర్ పాస్ చేశారు.’’ అని పేర్కొన్నారు.

‘‘నిమ్మగడ్డది గుంటూరు సొంత జిల్లా అయితే, ఆయనకు ఉద్యోగం ఇచ్చింది నాల‌భై సంవ‌త్స‌రాల ఇండ‌స్ట్రీ చంద్రబాబు చిత్తూరు జిల్లా. ఈ రెండు జిల్లాల్లో మాత్ర‌మే ఏక‌గ్రీవాలు చెల్ల‌వ‌ని వీళ్ళు ఇద్దరూ కూడబలుక్కుని చెప్తున్నారు. చ‌రిత్ర చూసిన‌ట్ల‌యితే అత్యున్న‌త‌మైన ప‌దవి రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, స్పీక‌ర్, రాజ్యాస‌భ స‌భ్యులు, ఇవన్నీ ఏక‌గ్రీవాలు చేయ‌డం చూశాం. పంచాయితీల్లో స‌ర్పంచ్, వార్డు మెంబరు ప‌ద‌వుల‌ు ఏక‌గ్రీవాలు కావడాన్ని చంద్రబాబు-నిమ్మగడ్డ జీర్ణించుకులేక‌పోతున్నారు. ఏ ప‌ల్లెలోనైనా చక్క‌ని వాతావ‌ర‌ణంలో గొడ‌వ‌లు లేకుండా, పెద్ద‌మ‌నుషులు అంతా కుర్చొని ఖ‌ర్చు లేకుండా, ఊరికిలాభ‌దాయ‌కంగా ఉండేట‌ట్లు పంచాయితీలను ఏక‌గ్రీవాలు చేసుకుంటారు. కానీ నిమ్మ‌గ‌డ్డ ప‌ద్ద‌తి గ్రామాల్లో గొడ‌వ‌లు పెట్టుకుని, డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకుని, వైషమ్యాలు పెంచాలని చెప్పినట్టు ఉంది. ఏక‌గ్రీవాలు కావ‌ద్దు అని చెప్పే అధికారం మీకు ఎవ‌రు ఇచ్చారు? నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హార‌శైలి మొద‌టి నుంచీ దూకుడుగా ఉంది. అంతేకాక తాను మీడియాలో కనిపించటం కోసం, కెమెరాల‌కు అట్రాక్ట్ కావ‌డంకోసం, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వ అధికారులందర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం ఆయనకు అల‌వాటైంది.’’ అని అన్నారు.

‘‘చ‌రిత్ర‌లో చంద్ర‌బాబును న‌మ్ముకుని ప‌నిచేసి బాగుప‌డిన వ్య‌క్తి ఎవ‌రూ లేరు.. అన్నది నిమ్మగడ్డ కూడా గుర్తించాలి. భవిష్యత్తులో నిమ్మగడ్డకు కూడా అదే జ‌ర‌గ‌బోతుంది. శ్రీ‌కాకుళం జిల్లా కింజరాపు అచ్చెన్నాయుడు నియోజ‌క‌వ‌ర్గంలోని నిమ్మాడలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుపడితే, అక్కడ గొడ‌వ‌లు జ‌రిగితే అక్క‌డ‌కు వెళ్ళి ఎంక్వాయిరీ చేయ‌రు కానీ ప్ర‌శాంతంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌ను ర‌ద్దు చేస్తామ‌నడం ద్వారా టీడీపీ పార్టీ మీద ఈయ‌న‌కు ఉన్న ప్రేమ-భక్తి కనిపిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టిన వ్య‌క్తి చంద్ర‌బాబు, ప్ర‌త్యేక హోదా వ‌ద్దు పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇస్తే చాల‌ని తాక‌ట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్ర‌బాబు. సీఎం ఎప్పుడు ప్ర‌ధానిని, అమిత్ షాని క‌లిసినా ప్ర‌ధానంగా అడిగేది ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక హోదాకు మేం క‌ట్టుబ‌డి ఉన్నాము. సంద‌ర్భం వ‌చ్చిన‌పుడు మాశక్తిని చూపించి, పోరాడ‌తాం. చంద్ర‌బాబుకు ఏటీయం పోల‌వ‌ర‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే చెప్పారు. టీడీపీ చేసిన అవినీతి, వారి‌ పోక‌డ‌లు గురించి ప్ర‌ధానికి, అమిత్ షాకి బాగా తెలుసు. ఏదో రిప్ర‌జంటేష‌న్ ఇచ్చి భుజాలు ఎగరేసుకోవడం వారి అవివేకానికి నిద‌ర్శ‌నం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నుంచి ఇంకా క్లార‌టీ రాలేదు. కేంద్రం నుంచి క్లారిటీ వ‌చ్చాక సీఎంతో మాట్లాడి, మా పార్టీ స్టాండ్ ప్ర‌కారం ఏం చేయాలో అది చేస్తాం.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల విష‌యంలో రాజీప‌డం.. రూ.13500 రైతు భ‌రోసా ఇచ్చిన రాష్ట్రం మాది.. ఇచ్చిన మాట మీద నిల‌బడిన రాష్ట్రం మాది.. రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్న‌ ప్రభుత్వం మాది.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం ఉండే ప‌థ‌కాలైతే స‌పోర్ట్ చేస్తాం.. రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉంటే వాటికి స‌పోర్ట్ చేయమ‌ని ఎంపీ బాల‌శౌరి వెల్ల‌డించారు. 8 నెల‌లు నిరీక్ష‌ణ చేస్తే టీడీపీ ఎంపీలకు అమిత్ షా అపాయింట్‌మెంట్ వ‌చ్చింది. వారు ఆయన దగ్గరకు వెళ్ళి ఏపీకి విభ‌జన హామీలు నెరవేర్చమని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడుగుతార‌ని ఆశిస్తే రాష్ట్రానికి సంబంధించిన‌వి కాకుండా వారి పార్టీకి చెందిన అంశాలు, వారి నాయ‌కుల‌కు చెందిన కేసుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌ని లాపు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు అన్నారు. దేవాలయాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ఎవరికీ మంచిది కాదు. ఈరోజు దేవుడు, దేవాలయాల గురించి లెక్చర్లు ఇస్తున్న చంద్ర‌బాబు.. తిరుమలలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేయించారు. అలానే 2016లో విజ‌య‌వాడ నడిబొడ్డులో 40 గుళ్లు కూల్చితే వాటిన ఈరోజు జ‌గ‌న్ పునర్నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి అమ‌రావ‌తిలో పుణ్య‌క్షేత్రం ఉంది. దానికి సంబంధించి కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం వందల ఎకరాల భూములను దాతలు దానం చేస్తే, అందులో స‌దావ‌ర్తి భూముల‌న్నింటిని కాజేయడానికి ప్ర‌య‌త్నించింది చంద్ర‌బాబు, వారి అనునాయులే. ఆరోజు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌మిళ‌నాడులో ఉన్న స‌దావ‌ర్తి భూముల్ని అమ్మ‌డానికి వీల్లేకుండా అడ్డుప‌డింది. దీనినిబ‌ట్టి ఎవ‌రు దేవాల‌యాల బాగు కోసం ఆలోచిస్తున్నారు.’’ అని అన్నారు.

‘‘ఎవరు దేవాల‌యాలన్నింటిని ధ్వంసం చేసి, వాటి ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించారో అర్థమవుతుంది. ఏపీ ఫైబ‌ర్ నెట్ పేరుతో చంద్రబాబు నాయుడు టెండర్స్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై సీబీఐ విచారణ వేయాలని ప్రధానిని కోరాం. దీనిపై త్వరలో కేంద్ర హోం మంత్రి షాను కలిసి వినతిపత్రం ఇస్తాం. టీడీపీ నేత‌లు కులం, మ‌తం, ప్రాంతం పేరుతో రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు మానుకోవాల‌ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ సూచించారు. ప్ర‌ధానంగా రాజ‌కీయాల్లో భావోద్వేగం క‌లిగించేవి కులం, మతం ప్రాంతీయం. వీటీలో ఏదో ఒక దాన్ని రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని టీడీపీ ప్ర‌ధాన ఆలోచ‌నలా ఉంది. మొదట కులం అన్నారు, కులం మీద ప్రాధాన్య‌త రావ‌డం లేద‌ని మతం, దేవుడి వెంట ప‌డ్డారు. 2014-15 నుంచి 2019-20వ‌ర‌కు దాదాపుగా 820 గుడులు మీద దాడులు జ‌రిగాయి. దాదాపుగా 40 పురాతన దేవాల‌యాలు చంద్రబాబు హయాంలో కూల‌గొట్టారు, వీటికి కార‌కులు ఎవ‌రు? దేవాలయాల్లో దాడులను నియంత్రించేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌త్యేక మైన శ్ర‌ద్ద తీసుకుని 36 వేల సీసీ కెమెరాలు 13 వేల గుడులల్లో ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.’’ అని తెలిపారు.

‘‘ఎవ‌రికి చిత్తుశుద్ది ఉంది. దేవాల‌యాల ప‌రిర‌క్ష‌ణ బాధ్యత ఎవ‌రు తీసుకున్నారు. ఎవ‌రైతే దేవాల‌యాల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకున్నారో వారి మీద నెపం నెట్టాలనే ప్ర‌య‌త్నాన్ని ప్ర‌జ‌లంద‌రూ గ‌మనిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఏ ఒక్క టెంపుల్‌లో సీసీ కెమెరాలు పెట్ట‌లేదు. దేవాల‌యాల మీద సీరియ‌స్‌నెస్ లేదు. దేవాల‌యాలు ప‌డ‌గొట్ట‌డంలో ఉన్న సీరియ‌స్‌నెస్ దేవాల‌యాల‌ను పున‌ర్నిర్మించ‌డంలో కానీ, దాడులు జ‌ర‌గ‌కుండా నిర్మూలించ‌డంలోకానీ టీడీపీకి సీరియ‌స్‌నెస్ లేదు. ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకున్న జగన్ మీద అభాండాలు వేయడం దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఎదోరకంగా అడ్డుకునేందుకు దేవాల‌యాల‌పై దాడులు అని చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు. ఇటువంటి ప‌నులు వ‌ల్ల శాశ్వ‌త ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌వని సుభాష్ చంద్ర‌బోస్ అన్నారు.’’ అని అన్నారు.

‘‘గ‌త ఐదు సంవ‌త్స‌రాల చంద్ర‌బాబు చెత్త పాల‌న చూసి ప్ర‌జ‌లు మా గౌర‌వ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్‌ని ఎన్నుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌జ‌ల ‌తీర్పును చూసి కూడా టీడీపీ వారు ప‌ద‌వీ వ్యామోహం త‌గ్గించుకోలేక, దాని కోసమే ప‌రితపిస్తూ ఎలెక్ష‌న్ క‌మిష‌న్‌ను ఎన్ని విధాలుగా వాడుకుంటున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. టీడీపీ ఎంపీలు అమిత్ షాను క‌లవడం చాలా హాస్యాస్ప‌దం. గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రానికి వారు చేసిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి వ‌చ్చిన నిధులను కమీషన్లు రూపంలో స‌ర్దుకుని, చ‌క్క‌బెట్టుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. మేము ఎంపీలగా గెలిచిన ద‌గ్గ‌ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, పెండింగ్ ఫండ్స్ గురించి, రాష్ట్ర‌ అభివృద్ది గురించి తిరుగుతుంటే టీడీపీ ఎంపీలు ఈ విధంగా స్పందించ‌డం క‌రెక్ట్ కాదు.. టీడీపీ వారికి మ‌న‌స్సాక్షి అసలు ఉందా.. అని అనురాధా ప్ర‌శ్నించారు? ప్ర‌జ‌ల గడప వద్దకే నేడు పరిపాల‌న తీసుకువెళుతూ ఆర్థిక లోటు ఉన్నా స‌రే ప్ర‌జ‌ల‌ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూ, అన్ని ప‌థ‌కాలు ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చుతున్నారు జ‌గ‌న్. టీడీపీ మూలానే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి నిధుల రాకుండా అడ్డుకున్న స‌రే ప్ర‌జ‌ల అభివృద్ధిని అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌రం కాద‌ని సీఎం నిరూపిస్తున్నారు.’’ అని అన్నారు.

‘‘అంత‌ర్వేదిలో దుండగులు ర‌థాన్ని ద‌గ్ధం చేస్తే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను గుర్తించి వెంట‌నే ర‌థానికి రూ.కోటి 13 ల‌క్ష‌ల‌కు ఖ‌ర్చుపెట్టి ర‌థాన్ని మూడు నెలల్లో త‌యారు చేయించారు.’’ అని పేర్కొన్నారు.