ప్రాంతీయం

ప్రకాశంలో సజావుగానే తొలి విడత ఎన్నికలు

ఒంగోలు, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 14 మండలాల్లో సజావుగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సరళిపై మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 192 గ్రామ పంచాయతీలలో ఉదయం 6.30 గంటలకే ఎన్నికలు మొదలయ్యా యని కలెక్టర్ తెలిపారు. ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరారని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్.పి.డి.ఓ.లు, ఇ.ఓ.పి.ఆర్.డి.లు, ఎస్.హెచ్.ఓ.లు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వివరించారు.

ఎన్నికలలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ముందురోజే ఎన్నికల సామాగ్రితో అధికారులు, సిబ్బంది చే రేలా ఏర్పాట్లు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారులు, స్టేజ్-1, స్టేజ్-2 అధి కారులకు దశలవారిగా శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగకుండా మండల స్థాయిలో ప్రత్యేక టీమ్ లు పనిచేస్తున్నాయని, ఆ టీమ్ లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షించేలా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

తొలిదశ పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు వేగంగా జరి గేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. 16 వార్డుల కంటే అధికంగా వున్న గ్రామ పంచాయతీలలో రెండు చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాంటి పంచాయతీలకు ఇద్దరు రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలవద్ద అదనపు పోలీసు బలగాలను నియమించామన్నారు. అలాంటి ప్రాంతాలలో వివాదాలు సృష్టించే వారిని, అనుమానస్పద వ్యక్తులను గుర్తించి వారిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా జరి గేలా మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. స్టాటిస్టికల్ సర్వే టీమ్ లు, వ్యయ కమిటీలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన చేస్తున్నాయని ఆయన వివరించారు.

రెండవ దశ గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో 64 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని కలెక్టర్ ప్రకటించారు. మరో ఐదు పంచాయతీ సర్పంచుల స్థానాలు ఏకగ్రీవం అయినప్పటికి వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని ఆయన వివరించారు. రెండవ దశలో 23 శాతం పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థలకు సూచనలిచ్చేలా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడంతో నామినేషన్ల తిరస్కరణ తగ్గాయని, తదుపరి నామినేషన్లకు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు.

కోవిడ్ నిబంధనలు అనుసరించి సిబ్బందికి అవసరమైనంత శానిటైజర్లు, మాస్క్ లు, ఫేస్ షీలు, పి.పి.ఇ. కిట్లు పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. ఓటర్లను దృష్టిలో వుంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒకరు చొప్పున ఆశా కార్యకర్తలను నియమించామన్నారు. తొలివిడత పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా అధి కారులకు పలు సూచనలు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెలువడేల అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. సమావేశంలో డి.పి.ఓ. జి.వి. నారాయణ రెడ్డి వున్నారు.