జాతీయం

ప్రజలకు నేరుగా అభివృద్ధి ఫలాలు: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): అభివృద్ధికి ఫలాలు ప్రజలకు చేరడంలో ఏ విధమైన ఆలస్యం (డిలే), ప్రాధాన్యత తగ్గింపు (డైల్యూషన్) మళ్ళింపు (డైవర్షన్) ఉండకూడదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు, స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎంపీ లాడ్స్‌ను సరైన సమయంలో సరైన పద్ధతిలో సద్వినియోగం చేయడం ద్వారా ప్రజలకు వాటి ఫలాలను అందించేందుకు కృషిజరగాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి ప్రతిపాదనల ఆధారంగా, 2006-2018 మధ్యలో 12 ఏళ్ల పాటు జరిగిన వైద్య, విద్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ డాక్టర్ కె.ఎన్. భండారీ రాసిన ‘పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎంపీలు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎంపీలాడ్స్ సాధికారత కల్పిస్తాయన్న ఉపరాష్ట్రపతి, 1993లో ఎంపీలాడ్స్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 19కోట్ల 47వేల పనులు పూర్తయ్యాయని, దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆస్తుల కల్పనకు ఈ పథకం ఉపయోగపడిందన్నారు. ఎంపీలాడ్స్ నిధులతో నడిచే కార్యక్రమాల్లో ఆలస్యాన్ని, ఇతర సమస్యలను ప్రస్తావించిన ఆయన, ప్రజలకు పథకాల ఫలితాలను అందించడంలో స్థానిక అధికారులు కూడా కలసిరావాలని పిలుపునిచ్చారు. పనుల గుర్తింపులో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎంపీలాడ్స్ నిధుల సద్వినియోగంలో పాదర్శకతకోసం థర్డ్ పార్టీ పర్యవేక్షణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, సరైన సమయంలో నిధుల సద్వినియోగం, ఈ పథకం పరిధిలో చేపట్టే కార్యక్రమాల నాణ్యత పెరగటం, నిర్దిష్ట సమయంలో ఈ కార్యక్రమాలు పూర్తవడం తదితర అంశాలపై పలు పార్లమెంటరీ కమిటీలు చేసిన సూచనలను కూడా ప్రస్తావించారు. ఇందుకోసం ఎంపీలు, స్థానిక అధికారుల సమన్వయం తప్పనిసరని తెలిపారు.

ఓ న్యాయవాదిగా, ఓ పార్లమెంటేరియన్‌గా, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తో పాటు వివిధ కమిటీల్లో సభ్యుడిగా డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, ఎంపీల్యాడ్స్‌ను సద్వినియోగం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయడంలో వచ్చే సంతృప్తిని ఈ పుస్తకం వెల్లడిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు అందించడం కీలకమైన అంశమని ఈ దిశగా సింఘ్వీ పనిచేయడం మిగిలిన ఎంపీలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి విద్య, వైద్య రంగాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన విషయంలోనూ పలు సూచనలు చేశారు. ఎంపీలు సత్ప్రవర్తనను కనబరుస్తూ, నిరంతరం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ నడతతో ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయం కావాలని సూచించారు. పార్లమెంటుకు హాజరవడంలో క్రమశిక్షణ పాటించడంతో పాటు చక్కని సూచనలు చేయడంలో చొరవతీసుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కంటే ప్రజలకు సాధికారత కల్పించడం, వారి నైపుణ్యాన్ని వృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ జీ, రాజ్యసభ అధికార పక్షనేత థావర్‌చంద్ గెహ్లోత్, విపక్ష నేత గులాంనబీ ఆజాద్, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు పార్లమెంట్ సభ్యులు అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.