జాతీయం

భారత్‌లో కోవిడ్ మరణాల కంటే బాధితులు తక్కువే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): భారత దేశంలో ఇంకా కోవిడ్ చికిత్స అందుకుంటూ ఉన్నవారి సంఖ్య క్త్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికత్స పొందుతూ ఉన్నవారు 1,51,460కి తగ్గారు. ఇది ఈనాటి వరకు నమోదైన మొత్తం మరణాలు (1,54,823) కంటే తక్కువ. చికిత్సలో ఉన్నవారి సంఖ్య మొత్తం పాజిటివ్ కేసులసంఖ్యలో 1.40% మాత్రమే ఉంది. భారత్‌లో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో 12,408 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రతి పది లక్షల జనాభాలో 7,828 పాజిటివ్ కేసులు రావటం ప్రపంచంలోనే అతి తక్కువ. రష్యా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఇంతకంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు వచ్చాయి.

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో పాజిటివ్ కేసులు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యాయి. లక్షదీవులలో అతి తక్కువగా సగటున 1722 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 ఫిబ్రవరి 5న ఉదయం 8 గంటలవరకు దాదాపు 50 లక్షలమంది (49,59,445) లబ్ధిదారులు కోవిడ్ టీకాలు అందుకున్నారు. గడిచిన 24 గంటలలో 5,09,893 మంది టీకాలు తీసుకున్నారు. వీరికోసం 11,184 శిబిరాలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 95,801 శిబిరాలు నిర్వహించారు.

టీకాలు అందుకున్నవారిలో 61% మంది 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 11.9% మంది (5,89,101) టీకాలు తీసుకున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో ఇప్పటివరకూ కోలుకున్నవారు దాదాపు కోటీ నాలుగు లక్షలమంది (1,04,96,308) కాగా గత 24 గంటలలో 15,853 మంది కోలుకున్నారు. కోలుకున్నవారి శాతం 97.16% కు చేరుకుంది. కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతూ ఉండటం వలన చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్న వారికీ మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 1,03,44,848కి చేరుకుంది. తాజాగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 85.06% మంది కేవలం 6 రాష్టాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 6,341 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 5,339 మంది, తమిళనాడులో 517 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 12,408 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 84.25% మంది 6 రాష్ట్రాల వారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 6,102 కేసులు రాగా, రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2,736, తమిళనాడులో 494 కేసులు వచ్చాయి. గత 24 గంటలలో 120 మరణాలు నమోదయ్యాయి. వీరిలో 74.17% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలో అత్యధికంగా 46 మంది చనిపోగా కేరళలో 17 మంది, పంజాబ్, ఢిల్లీలో ఏడుగురు చొప్పున చనిపోయారు. గత 24 గంటలలో 14 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, లద్దాఖ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా- నాగర్ హవేలి, డామన్ – డయ్యూ, లక్షదీవులు.

భారత్ దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో కోవిడ్ మరణాలు 112 కాగా ఇది ప్రపంచంలో నమోదైన అతి తక్కువ సంఖ్య. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంట్ తక్కువ ఉండటం గమనార్హం. లక్ష దీవులలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు సున్నా ఉండటం గమనార్హం. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్ష్జల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీ ప్రతి పదిలక్షల జనాభాలో 581 మరణాలతో మొదటి స్థానంలో ఉంది.