ప్రాంతీయంసంస్కృతి

రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ కల్యాణమస్తు

మంగళగిరి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): తిరుమల, తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళ్యాణ మస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యవర్గ సభ్యులు చుండూరు ఉమా మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మే 28వ తేదీన ఈ సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివాహాల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని సంబంధిత దరఖాస్తు ప్రతిని డౌన్‌లోడ్ చేసుకుని సమీపంలోని జిల్లా టీటీడీ కళ్యాణ మండపంలో లేదా మాజేటి సూర్యవేణుగోపాల శ్రేష్ఠి, మంగళగిరి, సెల్ 9848520207, చుండూరు ఉమామహేశ్వరరావు, దుగ్గిరాల సెల్ 9848677606లకు ఈ నెల 20వ తేదీ లోగా అందజేయాలని సూచించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 2 గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, వెండి మెట్టెలు, వధూ వరులకు నూతన వస్త్రాలను అందజేస్తామన్నారు.

అలానే ప్రతి జంటకు 50 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. వివాహానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. అలానే మండలంలో 30 మంది దరఖాస్తు చేసుకుంటే అదే మండలంలో ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తారని లేని పక్షంలో జిల్లా ప్రధాన కేంద్రంలో ఈ వివాహాలు నిర్వహిస్తారని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజేటీ సూర్య వేణుగోపాల శ్రేష్ఠి తదితరులు పాల్గొన్నారు.