అందుబాటులోకి విజయ ఐస్ క్రీమ్స్

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): నాంపల్లిలోని లలిత కళా తోరణంలో విజయ తెలంగాణ నూతనంగా ఉత్పత్తి చేసిన విజయ ఐస్ క్రీమ్స్‌ను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే లాభాల బాటలోకి వచ్చింది విజయ డెయిరీ. ఐస్ క్రీమ్స్ ప్రారంభం సందర్భంగా విజయ డెయిరీకి 1000 రూపాయల ఇన్‌సెంటివ్ ప్రకటిస్తున్నాను. దేశంలో ఎక్కడా లేనివిధంగా విజయ డెయిరీ రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో 1000 విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాము. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ప్రభుత్వం. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి విజయ డెయిరీని తీసుకెళ్తాం. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్‌లో విజయ తెలంగాణ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాం. రైతులు అందరూ విజయ డెయిరీకే పాలు పోయాలి.’’ అని అన్నారు.

Latest News