ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీలో హింస

ఎర్రకోటను ముట్టడించిన రైతులు..

న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): దేశ రాజధాని నగరం రణరంగమైంది. గణతంత్ర దినోత్సవ వేళ రైతుల రాళ్లదాడులు, పోలీసుల లాఠీచార్జితో నగరంలోని పలు రోడ్లు యుద్ధాన్ని తలపించాయి. ట్రాక్టర్‌ తిరగబడి ఓ రైతు మరణించాడు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ 41 రైతు సంఘాలు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసకు దారితీసింది. పోలీసులు ముందుగా నిర్దేశించిన మార్గాలను వదిలి కొందరు రైతులు చారిత్రక ఎర్రకోటను ముట్టడించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కోటలో ప్రధాని జాతీయ జెండా ఎగరేసే బురుజుపై సిక్కు మత పతాకాన్ని, ఒక రైతు సంఘం జెండాలను ఎగురవేశారు. నగరంలో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఉదయం 11 గంటలకు ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభం కావాలని పోలీసులు సూచించగా ఉదయం 8.30కే రైతులు యాత్ర మొదలుపెట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో హింస చెలరేగింది. రైతులను అదుపుచేసేందుకు పోలీసులు అనేక చోట్ల లాఠీచార్జి చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పటంతో నగరంలో కీలకమైన మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

హింసాత్మక చర్యలను ప్రభుత్వంతోపాటు రైతు సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. తమ ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడ్డాయని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆరోపించింది. ట్రాక్టర్‌ మార్చ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘర్షణల్లో 83 మంది పోలీసులు గాయపడినట్టు ఢిల్లీ పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

చారిత్రక ఎర్రకోటపై నిత్యం జాతీయ జెండా రెపరెపలాడే చోట మంగళవారం సిక్కు మత జెండా ఎగిరింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని జాతీయ జెండా ఎగురవేసే బురుజుపై కొందరు యువకులు కాషాయ వర్ణంలో ఉండే సిక్కు పతాకాన్ని ఎగురవేశారు. ఈ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎర్రకోట వద్ద రైతుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు పోలీసులు అక్కడున్న లోతైన గోతిలోకి దూకేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కోసం ఫెన్సింగ్‌ పైకి ఎక్కి పోలీసులు దూకేసిన ఆ గొయ్యి 15 అడుగులకు పైగా లోతు ఉంది. ఇలా దూకేసిన పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీలో రైతుల ఆందోళనలో చోటుచేసుకున్న హింస, విధ్వంసంలో 86 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాదాపు సగం మంది ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లోనే గాయాపడ్డారన్నారు.

ట్రాక్టర్‌ ర్యాలీలో చెలరేగిన హింసను సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా ఖండించింది. ఇది సంఘ విద్రోహుల చర్య అని ఆరోపించింది. తమ ఉద్యమంలో సంఘ విద్రో హులు ప్రవేశించారని, హింసాకాండ వారిపనేనని ప్రకటించింది. దేశ గౌరవానికి ప్రతీక అయిన ఎర్రకోటను గణతంత్ర దినోత్సవం రోజు ముట్టడించటం ద్వారా దేశానికి తలవంపులు తెచ్చారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ మండిపడ్డారు. హింస ఏ రకంగానూ పరిష్కారం కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీ హింసపై సుమోటోగా విచారణ జరుపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముంబై లా విద్యార్థి ఒకరు లేఖ రాశారు.

Latest News