విశాఖ అభివృద్ధి జ‌గ‌న్‌తోనే సాధ్యం

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డితోనే విశాఖ అభివృద్ధి సాధ్య‌మ‌ని ప్ర‌జ‌లంతా విశ్వ‌సిస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ న‌గ‌రంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు.

విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో 53,54,55,42, 43, 44, 26, 25 వార్డుల్లో పర్యటించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పన, రహదారులు, వంతెనలు, డ్రైనేజ్, రవాణా, ఆస్పత్రులు, కమ్యూనిటీ హాల్స్, ఇళ్ళ పట్టాల నమోదు వంటి పలు అంశాలపై స్థానికులతో చర్చించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవీఎంసీ ఎన్నికలను నిర్వహించకుండా విశాఖ అభివృద్ధిని అడ్డుకుందని, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

త‌న తండ్రి దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బాటలోనే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్ రెడ్డి విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన టిడిపి నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హంతకుడని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. విజయవాడలో హత్యచేసి విశాఖకు పారిపోయి వచ్చాడని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని కాకుండా ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వెలగపూడి నుంచి సమస్యలు వస్తే ఫిర్యాదు చేయాలని, విశాఖ నుంచి ఆయ‌న్ను తరిమికొడదామని విజయసాయిరెడ్డి సూచించారు.

Latest News