రాజకీయం

అచ్చెన్న అరెస్టుతో ప్రభుత్వానికి ఏం సంబంధం?

అమరావతి, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికలను ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యకాండ చేస్తోందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ విధంగా బెదిరింపులకు దిగారో ప్రజలంతా చూశారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అరాచకాలు సృష్టించిన అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని, ఆ అరెస్టుతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై సీఎం కక్షసాధింపు అని చంద్రబాబు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు దాడులు, బెదిరింపులు చంద్రబాబుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్‌కు ఏం పని అని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతగా ప్రతిచోట తిరుగుతున్నారన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు అండగా వెళ్తే దౌర్జన్యం చేశాడని చంద్రబాబు లేనిది ఉన్నట్లుగా తనకు అనుకూలంగా మాట్లాడడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. చంద్రబాబు అభూత కల్పనలు ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందని, సుప్రీం ఆదేశాలు పాటిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి మాట్లాడిందే టీడీపీ మాట్లాడుతుందని, చంద్రబాబు మాట్లాడింది రమేష్‌ చౌదరి మాట్లాడుతున్నారని, వైయస్‌ఆర్‌ సీపీ వచ్చి తెలుగుదేశంతో పోటీ చేస్తుందా? రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పోటీ చేస్తుందా అని అర్థం కావడం లేదన్నారు. ఏదేమైనా చంద్రబాబు, నిమ్మగడ్డ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, వాస్తవాలను ప్రజలకు చెప్పండి అని కోరారు.

కడపలో వైయస్‌ఆర్‌ మంచితనం గురించి చెప్పిన నిమ్మగడ్డ చౌదరి చిత్తూరులో చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు గురించి చెప్పగలడా? ఓటుకు కోట్ల కేసులో ప్రధాన నిందితుడి దగ్గర కార్యదర్శిగా పనిచేశానని చెప్పే ధైర్యం ఉందా? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో తహసీల్దారు ఓ మహిళకు ఇంటి పట్టా ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎస్సీ మహిళపై దౌర్జన్యం చేశాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మద్దతుగా నిలవాలని చంద్రబాబు చెబుతుంటాడు వాళ్ల నాయకులు మాత్రం ఆ సామాజిక వర్గాలపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారు.

బలవంతంగా ఏకగ్రీవాలు అని చంద్రబాబు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దౌర్జన్యాలపై ప్రభుత్వం కూడా స్పందిస్తుందని, చట్టాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రులు వివరణ కోరకుండానే గవర్నర్‌కు ఏ విధంగా లేఖ రాశారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డను మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్‌ను కూడా బెదిరిస్తున్నట్లుగా ఎస్‌ఈసీ లేఖ ఉందన్నారు. తమ హక్కులకు భంగం కలిగిందనే ఎస్‌ఈసీపై స్పీకర్‌కు లేఖ రాశామని, ప్రివిలేజ్‌ కమిటీ విచారణ తరువాత స్పీకర్‌ స్పందిస్తారన్నారు. గతంలో ఇంటి ఘటనపై మహారాష్ట్ర అసెంబ్లీ కూడా అక్కడ ఎస్‌ఈసీపై చర్యలు తీసుకుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.