సంపాదకీయం

ఎక్కడ, ఎవరు విజేతలో?

అమరావతి, మార్చి 7 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా కొన్ని కొన్ని నగరాల్లో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. విజయవాడ, విశాఖపట్నం అలాగే ఏలూరు, గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా వైసిపి చాలా బలంగా ఉంది. అయితే, ఈ కార్పొరేషన్లు వైసీపీ గెలవలేదు అంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నగరాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమ్మ సామాజిక వర్గంను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ వస్తోంది వైసిపి. అమరావతి విషయంలో కమ్మ సామాజికవర్గంను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కూడా కులం పేరుతో వైసీపీ నేతలు దూషించిన పరిస్థితి ఉంది. ఇక అది పక్కన పెడితే నగరాల్లో పెద్దగా అభివృద్ధి కూడా ఎక్కడా జరిగిన పరిస్థితులు కనపడటం లేదు అని చెప్పాలి. రాజకీయంగా ఉన్న లక్ష్యాలు మినహా పెద్దగా నగరాల్లో ఉన్న పేదలకు కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించిన పరిస్థితి లేదు అనే విషయం చెప్పవచ్చు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కేశినాని కుటుంబం ఇక్కడ చాలా బలంగా ఉంది. కేశినాని కుమార్తెకు మేయర్ అభ్యర్ధి కేటాయించడంతో ఎంపీ కాస్త గట్టిగానే శ్రమిస్తున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంత కష్టపడినా సరే అనుకున్న విధంగా ఫలితం మాత్రం వచ్చే అవకాశం లేదు అని చెప్పవచ్చు. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఏలూరు విషయానికి వస్తే ఏలూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ప్రచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక గుంటూరు విషయానికొస్తే వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఇక్కడ కోవెలమూడి రవీంద్రబాబు మేయర్ అభ్యర్థిగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో అమరావతి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలిచిన సరే గుంటూరు గెలవడం మాత్రం అంత సులువు కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.