రాష్ట్రీయం

బాధ్యులు ఎవరు?

అమరావతి, జనవరి 24 (న్యూస్‌టైమ్): వ్యాక్సినేష‌న్‌, ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించ‌డం సాధ్యం కాదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే కేసుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని వ్యాక్సినేష‌న్ చేస్తే కోవిడ్ తీవ్ర‌త త‌గ్గుతుంద‌న్నారు. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్ చేయ‌డ‌మే స‌రైన నిర్ణ‌య‌మ‌న్నారు.

2018లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంద‌ని, అప్ప‌ట్లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ఎందుకు న్యాయ పోరాటం చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌రో మూడు నెల‌ల్లో త‌న ప‌ద‌వీ కాలం ముగుస్తుంద‌ని ఇప్పుడు హ‌డావుడి చేసి..అధికారుల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం స‌రైంది కాద‌న్నారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ అహంకారంతో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశార‌ని, ఇవాళ ఆయ‌న నిర్వహించిన ప్రెస్‌మీట్ పొలిటిక‌ల్ స‌మావేశంలా ఉంద‌ని చెప్పారు. ఈ నెల 25న ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రుగ‌నుంద‌ని, కోర్టు తీర్పును రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌విస్తుంద‌ని, ప్ర‌జ‌లు, ఉద్యోగుల ప్రాణాలే మా ప్ర‌భుత్వానికి ముఖ్య‌మ‌ని అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు.

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ఇవాళ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశం పొలిటిక‌ల్ లీడ‌ర్ నిర్వ‌హించిన‌ట్లుగా ఉంది. చుట్టూ అద్దాలు ఏర్పాటు చేసుకొని, గొట్టాల‌కు మాత్ర‌మే రంద్రాలు పెట్టి చాలా జాగ్ర‌త్త‌గా ప్రెస్‌మీట్ పెట్టారు. ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త రాజ్యాంగంలో ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఉంది. మేం కూడా దీన్ని ఒప్పుకుంటాం. ఎన్నికల కమిషన్ విధి అందరికీ తెలిసిన సత్యమే.’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

‘‘ఇవాళ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఏక‌ప‌క్షంగా, ప్ర‌భుత్వంతో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండా, ఉద్యోగ సంఘాల విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా అహంకారపూరితంగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2018 పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పుడు ఎందుకు నిమ్మ‌గ‌డ్డ న్యాయ‌పోరాటం చేయ‌లేదు. అప్పుడు కూడా ఎన్నికల కమిషనర్‌గా ఈయ‌నే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త మీది కాదా? అప్ప‌ట్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంలో క‌మిష‌న‌ర్ విఫ‌ల‌మ‌య్యారు. అప్ప‌ట్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే చంద్ర‌బాబుకు న‌ష్టం క‌లుగుతుంది కాబ‌ట్టి మూడేళ్ల పాటు నిద్ర‌పోయి మ‌రో మూడు నెల‌ల్లో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌టంతో హ‌డావుడిగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.’’ అని విమర్శించారు.

‘‘ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంది. మా ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి అధికారం క‌ట్ట‌బెట్టారు. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా మాదే విజ‌యం. అయితే ప్ర‌జ‌లు, ఉద్యోగుల ప్రాణాలు మా ప్ర‌భుత్వానికి ముఖ్యం. కోవిడ్ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దుర్మార్గమైన ఆలోచనలతో ఎన్నికల కమిషన్ పోతుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయింది. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు మాకు ప్రజలు ఉద్యోగ ప్రాణాలు ముఖ్యం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉంటాడు, ఎన్నికల కమిషనర్ హైదరాబాద్‌లో ఉంటారు. 2008 మార్చి 18న నిమ్మగడ్డ హోం సెక్రటరీకి లెటర్ రాసి ఉంటే ఈ లేఖ‌ టిడిపి కార్యాలయం నుండి వచ్చింది. ఈ లేఖ ఎందుకు లీక్ అయింది. ఎన్నికల్లో ఏకగ్రీవంగా కాకూడదా? గ్రామాల్లో అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఏక‌గ్రీవ పంచాయ‌తీకి రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల దాకా ప్రోత్సాహ‌కాలు అంద‌జేస్తోంది.’’ అని రాంబాబు పేర్కొన్నారు.

‘‘ఎన్నికల కమిషనర్ విడ్డూరంగా మాట్లాడుతున్నాడు. రాజకీయ పరకాయ ప్రవేశం విద్య తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. ఎన్ని విద్యలు తెలిసిన అపజయం తప్పదు. ఎన్నికలకు కొంత‌ కాలం ఆగాల్సిందే. అహంకారంతో, అధికార గర్వంతో పనిచేసే వారికి ప్రజలు స‌హ‌క‌రించ‌రు. ఎన్నిక‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఒకేసారి నిర్వ‌హించ‌డం సాధ్యం కాదు. కోవిడ్ కార‌ణంగా ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు వ‌ద్దంటున్నాం. వ్యాక్సినేష‌న్ త‌రువాత కోవిడ్ త‌గ్గుతుంది. మాకు ప్ర‌జ‌లు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని అభిప్రాయం తెలిపింది. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నెల 25న సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రుగ‌నుంది. సుప్రీం కోర్టుకు కూడా మా అభిప్రాయాన్ని తెలియ‌జేస్తాం. ప్రజల క్షేమం గురించి ఈరోజు ఎన్నికల వద్దంటున్నా.’’ అని అన్నారు.

‘‘ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అధికారుల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అధికారుల‌ను బ‌దిలీ చేస్తున్నారు. ఎస్పీ నుంచి కానిస్టేబుల్ దాకా ట్రాన్స్‌ఫ‌ర్స్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా మీరు విధులు నిర్వర్తించండి.. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదు. ఈసీ తీరు అప్రజాస్వామికం, అన్యాయం, అక్రమం. మూడేళ్ల పాటు ఎన్నికలు జరపకుండా నిద్రపోయారు.. కోర్టులో న్యాయ‌పోరాటం చేయ‌లేదు. క‌రోనా స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌ర్తిస్తే.. ఎవ‌రైనా అధికారులు కోవిడ్‌తో మ‌ర‌ణిస్తే ఎవ‌రు బాధ్య‌లు. ఎన్నిక‌ల్లో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు ప్ర‌త్య‌క్షంగా విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ప్ర‌జ‌లంతా ఓటు హ‌క్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఎన్నిక‌ల విధుల్లో బీపీ, షుగ‌ర్ లాంటి వ్యాధులు ఉన్న వారు పాల్గొంటే.. వారికి క‌రోనా సోకి మ‌ర‌ణిస్తే.. ఆ కుటుంబాలు రోడ్డున ప‌డాల్సిందేనా? ఆ కుటుంబాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం. మీరు బాధ్యులు కాదు కాబట్టి ఎన్నికలు వాయిదా వేయమని ప్రభుత్వం కోరుతోంది. మూడు నెల‌ల్లో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఆ లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించి, త‌న అధికారాన్ని చెలాయించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. మా ప్ర‌భుత్వానికి ఇంకా మూడేళ్లు అధికారంలో కొన‌సాగేందుకు ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు. మ‌రో ముఫ్పై ఏళ్లు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నిక‌లు మీ సొంత వ్యవహారం కాదని గుర్తుంచుకోవాలి.’’ అని అన్నారు.

‘‘ఎన్నికలు అమెరికాలో పెట్టారు.. ఇత‌ర రాష్ట్రాల్లో పెట్టార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అంటున్నారు. అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించిన స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో ఇప్ప‌టికే ఈ ప్ర‌క్రియ మొద‌లైంది. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సిన్ వేయించుకున్న వారు 45 రోజులు అబ్జ‌ర్‌వేష‌న్‌లో ఉండాలి. ఉద్యోగులు, ప్ర‌జ‌ల ప్రాణాల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని ఎమ్మెల్య అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.